Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ సర్కార్ మీద తామరతంపరగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కి అనుకోని అనుభవం ఎదురైంది. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ఆయన తనకు భద్రత కల్పించాలని కోరారు. ఆ సభలోనే టీడీపీ సర్కార్ మీద నిప్పులు చెరిగారు. లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఆపై టీడీపీ, జనసేన సంబంధాల్లో చాలా మార్పు వచ్చింది. జనసేన వెనుక బీజేపీ ఉందన్న సందేహాలు కూడా వచ్చాయి. అయితే ఈ పరిణామాలను ఏ మాత్రం పట్టించుకోకుండా టీడీపీ సర్కార్ పవన్ కి భద్రత కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది, ఆయనకి నలుగురు గన్ మెన్ లని కేటాయిస్తూ ఏపీ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. సహజంగా రాజకీయ ప్రత్యర్థులకు భద్రత తగ్గిస్తారు. అయితే పవన్ తాను టీడీపీకి ప్రత్యర్థి అని ప్రకటించుకున్నాక కూడా చంద్రబాబు సర్కార్ ఆయనకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం వెనుక “ఆపరేషన్ గరుడ “ ప్రభావం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆపరేషన్ గరుడ లో భాగంగా ఏపీ లో టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి జరిపి ఆ నెపం ప్రభుత్వం మీద వేయొచ్చన్న భయమే తాజా నిర్ణయానికి కారణం కావొచ్చు అంటున్నారు. శివాజీ ఆపరేషన్ గరుడ వ్యూహాలు బయటపెట్టాక అందులో కొన్ని మార్పులు ఉండొచ్చని టీడీపీ సర్కార్ భావిస్తోంది. అందుకే ఆ వ్యూహాలు ఏ రకంగా ఉన్నప్పటికీ ఎదుర్కోడానికి సర్వసన్నద్ధంగా వుండాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆపరేషన్ గరుడ కి కౌంటర్ గా పవన్ కి భద్రత మీద నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆపరేషన్ గరుడలో భాగంగా పవన్ మున్ముందు టీడీపీ సర్కార్ మీద విమర్శలు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి ఉంటుంది.