ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా రాష్ట్ర రాజధాని అంశం కీలకంగా మారింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ చేసినటువంటి రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనపై రాష్ట్ర ప్రతిపక్ష నేతలందరితో పాటు అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలందరూ కూడా తీవ్రగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి లోని రైతులందరూ కూడా పలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీలోని ముఖ్యమైన నేతలందరితో కలిసి నేడు ఒక కీలకమైన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
కాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు, రాజకీయ వ్యవహారాల కమిటీ, వ్యూహాత్మక కమిటీల సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, పార్టీకి సంబందించిన కీలకమైన నేతలందరూ కూడా హాజరవనున్నారని సమాచారం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మూడు రాజధానుల అంశం, రైతుల ఆందోళన కార్యక్రమాలు కి సంబందించిన చర్చలు జరపనున్నారని సమాచారం. కాగా ఇటీవల నాదెండ్ల మనోహర్, నాగబాబు, ముఖ్య నాయకులు రాజధాని గ్రామాలలో పర్యటించి రైతులను, ప్రజలను కలుసుకొని సేకరించిన కొంత సమాచారాన్ని పవన్ కి అందజేశారు. ఆ నివేదికపై కూడా చర్చించనున్నారని సమాచారం.