డేటా చోరీ వ్యవహారం ముదురుతోంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఈ విషయమై పోరు రోజు రోజుకూ తీవ్రమవుతోంది. డేటా చోరీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసింది. డేటా చోరీ అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తారు.
ఈ బృందంలో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. సీనియర్ ఐపీఎస్‌లతో పాటు సాంకేతిక నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. బుధవారం సాయంత్రం టీడీపీ నేతలు గుంటూరు రూరల్ ఎస్పీకి తమ పార్టీ డేటాను వైసీపీ నేతలతో కలిసి కుట్ర పన్ని తెలంగాణ పోలీసులు చోరీ చేశారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి తమ డేటా ఉన్న ఐటీ గ్రిడ్ కార్యాలయంలో గత నెల ఇరవై మూడో తేదీన సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసు అధికారుల సీసీ టీవీ ఫుటేజీని అందించారు. అలాగే వైసీపీ కాల్ సెంటర్ నుంచి టీడీపీ నేతలకు వస్తున్న కాల్స్ వివరాలను కూడా అందించారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రధానంగా హైదరాబాద్‌లో పోలీసులు, వైసీపీ నేతలతో పాటు అక్కడ కొంత మంది రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు కనిపిస్తుండంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. మరి ఈ డేటా లీక్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.