తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్, ఏపీ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన రెండు ఆర్డినెన్స్‌లలో ఒకదాన్ని గవర్నర్ నరసింహన్ తిప్పిపంపారు. చుక్కల భూముల (డాటెడ్ ల్యాండ్)పై ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌లో దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం రెండు నెలలుగా నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పున:పరిశీలనకు పంపారు. ఏపీ ప్రభుత్వం పంపిన రెండు ఆర్డినెన్స్‌ల్లో ఏపీ అసైన్డ్‌మెంట్ ల్యాండ్ ఆర్డినెన్స్‌కు మాత్రమే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో గవర్నర్, ఏపీ ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయని భావిస్తున్నారు. అయితే పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఐదేళ్ల తర్వాత అమ్ముకునేలా ఇప్పటివరకు ఉన్న నిబంధనలను ఏపీ ప్రభుత్వం మార్చింది.
వీటిని 20ఏళ్ల తర్వాత మాత్రమే అమ్ముకునేలా చర్యలు తీసుకుంటూ ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. కానీ చుక్కల భూములపై జారీచేసిన ఆర్డినెన్స్‌ను మాత్రం గవర్నర్ ప్రభుత్వానికి తిప్పి పంపారు. దీంతో గవర్నర్ తీరు పై అధికార పార్టీ నేతలు మండి పడుతున్నారు. గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని గతంలో నాలా ఆర్డినెన్స్ విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారని గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌లకు గవర్నర్ ఆమోదం తెలపడం అన్నది సాధారణ విషయమే. చాలా ప్రత్యేక సందర్భాల్లో తప్ప గవర్నర్ వీటిని తిరస్కరించరు. అయితే ప్రభుత్వం, గవర్నర్ మధ్య గ్యాప్ ఉండటంతోనే తరుచూ ఇలాంటి సమస్య తలెత్తుతోందని భావిస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.