‘జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్లో రోడ్ల ప్రాజెక్టులు చేయలేమంటూ రెండు అంతర్జాతీయ బ్యాంకులు ఏఐఐబీ, ఎన్డీబీ మధ్యలోనే వెళ్లిపోయాయి. ఈ రెండు బ్యాంకులూ రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాయి. రోడ్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేసి, పక్కదారి పట్టించిందని ఆ బ్యాంకులు తప్పుపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థికశాఖ ముందే హెచ్చరించినా ఈ ప్రభుత్వం స్పందించలేదు’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ‘ఆ రెండు బ్యాంకులూ రూ.1,070 కోట్లు రుణంగా ఇస్తే అందులో దాదాపు రూ.300 కోట్లు దుర్వినియోగమయ్యాయని ఆ బ్యాంకులే నివేదికలు ఇచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల అంతర్జాతీయస్థాయిలో రాష్ట్రం పరువు పోయింది. భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి ఈ బ్యాంకుల నుంచి రుణాలు అందని ప్రమాదం ఏర్పడింది’ అని ఆయన దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నాలుగున్న రేళ్ల నుంచి జగన్ ప్రభుత్వం రోడ్లు, వంతెనల నిర్మాణం, నిర్వహణపై శీతకన్ను వేసింది. అక్రమాలకు, అవినీతికీ అలవాటుపడి దేశస్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర పరువును గంగలో కలిపింది. ప్రాజెక్టులు అద్భుతంగా నిర్మిస్తున్నామని ప్రతి సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే జగన్.. చివరికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), న్యూడెవలప్మెంట్ బ్యాంకుల నుంచి రహదారులు నిర్మిస్తామని తీసుకువచ్చిన రుణాలను దారి మళ్లించారు’ అని దుయ్యబట్టారు.
కేంద్రం హెచ్చరించినా స్పందించని రాష్ట్ర సర్కార్
‘బ్రిక్స్ ఒప్పందం ప్రకారం అయిదు దేశాల్లో చేపట్ట్టే ప్రాజెక్టులకు ఎన్డీబీ (న్యూడెవలప్మెంట్ బ్యాంకు) రుణాలు ఇస్తుంది. ఇందులో భాగం గా రూ.6,400 కోట్లతో రోడ్లు, వంతెనల పునరుద్ధరణ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ఎన్డీబీ ముందుకు వచ్చింది. ఈ మొత్తంలో బ్యాంకు రుణం రూ.4,771 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,668 కోట్లు. 1,231 కి.మీ. రహదారులు రెండు వరుసలుగా మార్చాలి. 18 వంతెనలను నిర్మించాలి. 2021 జనవరి 21న ఒప్పందం కుదిరితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదు. బ్యాంకు తొలివిడతగా రూ.245 కోట్ల రుణం ఇస్తే ఆ నిధులను రాష్ట్రం ప్రభుత్వం మళ్లిం చేసింది. కేంద్రం ఈ రుణానికి గ్యారంటీ ఇచ్చింది. దేశ పరువుకు సంబంధించిన విషయమిది. దేశానికి చెడ్డపేరు వస్తోందని కేంద్రం హెచ్చరించినా వైకాపా ప్రభుత్వం స్పందించలేదు. కేవలం 5శాతం పనులు మాత్రమే చేయడంతో రుణం ఇచ్చిన బ్యాంకు విస్తుపోయి ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగింది’ అని వెల్లడించారు.
బ్యాంకుల నుంచి రెడ్ఫ్లాగ్ నోటీసులు
‘రహదారుల నిర్మా ణానికి ఏఐఐబీతో రూ.4,395 కోట్ల ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరింది. బ్యాంకు రుణం . రూ.3,003 కోట్లు. రాష్ట్రం వాటా రూ.1,392 కోట్లు. ఇందులో 6 వేల కి.మీ. రోడ్లు నిర్మించాలి. 2023 అక్టోబరు నాటికి పూర్తి కావాలి. తొలి విడతలో రూ.825 కోట్లు బ్యాంకు రుణం ఇస్తే రాష్ట్రం రూ.200 కోట్ల వాటా ఇచ్చింది. పనులు చేయకపోవడం, రాష్ట్రం నిధులు ఇవ్వ కపోవడంతో ఈ ప్రాజెక్టునూ బ్యాంకు రద్దు చేసుకుంది. ఎన్డీబీ ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు రెడ్ఫ్లాగ్ నోటీసులు ఇచ్చింది’ అని మనోహర్ మండిపడ్డారు.