రాజధాని అమరావతిని ఇటు విజయవాడకు, అటు గుంటూరుకు అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన కొత్త రైల్వే లైన్కు బడ్జెట్లో ఎంత ఇవ్వనున్నారో తెలుసా? అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమే. రూ.2,679 కోట్ల వ్యయమయ్యే ఈ లైన్కు గత అయిదేళ్లలో రూ.2.20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా సర్వేల కోసం వెచ్చించిందే. ఇపుడు రూ.వెయ్యి ఇస్తామని పేర్కొనడం చూస్తే కేంద్రం మన రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో గతంలో మంజూరైన వివిధ లైన్లకు కూడా రూ.వెయ్యి నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షలు ప్రకటించారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా జోన్ కార్యాలయాలు తదితరాలకు కలిపి రూ.170 కోట్లు వ్యయం అవుతుందని గతంలో అంచనా వేయగా, దీనికి ఇప్పుడు ఇస్తామంటున్నది కేవలం రూ.9 కోట్లు.
ఇది రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బడ్జెట్లో పేర్కొన్న నిధుల తీరు. కొన్నింటికి మొక్కుబడిగా ఇవ్వగా.. అత్యధిక ప్రాజెక్టులకు మొండిచేయి చూపింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు సాధించడంలో జగన్ ప్రభుత్వం, వైకాపా ఎంపీలు మరోసారి విఫలమయ్యారు. కేంద్ర తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా, అందులో రైల్వే శాఖకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. వాటిలో రాష్ట్రానికి చెందిన కీలక ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మొత్తంగా రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్కు కలిపి రూ.9,138 కోట్లు కేటాయించారు.