జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాకినాడలో బస చేస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. స్థానిక జేఎన్టీయూకే రోడ్డులో పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలుకుతూ ఇటీవల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాకినాడ వైకాపా గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్న బాబుకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుక్రవారం అక్కడ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలకు.. జనసేన ఫ్లెక్సీలు అడ్డుగా ఉన్నాయని కొందరు తొలగించి, ట్రాక్టరులో తరలిస్తుండగా జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎవరు తొలగించమన్నారంటూ నిలదీయడంతో ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి వారు వెళ్లిపోయారు. దీంతో జనసేన గ్రామీణ ఇన్‌ఛార్జి పంతం నానాజీ, కార్యకర్తలు జేఎన్టీయూ వద్దకు చేరుకుని తొలగించిన వాటిని తిరిగి ఏర్పాటు చేసేవరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించడంతో రెండు గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఎవరైతే ఫ్లెక్సీలు తొలగించారో వారితోనే వాటిని పోలీసులు కట్టించడంతో నాయకులు వెనుదిరిగారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ తమ అధినేత పవన్‌కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇక్కడే ఉన్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.