AP Politics: తల్లికి, చెల్లికి విలువివ్వని వాడు మనకేం చేస్తాడు: పవన్ కళ్యాణ్

AP Politics: He who does not value his mother and sister, what will he do to us: Pawan Kalyan
AP Politics: He who does not value his mother and sister, what will he do to us: Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడే వరకు తెలుగుదేశం జనసేన మైత్రి కొనసాగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ఈ పొత్తుకు బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉంటాయని యువగళం విజయోత్సవ సభలో ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందన్న పవన్‌..ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తెలుగుదేశం-జనసేన తీసుకున్నాయని పేర్కొన్నారు. మార్పు తీసుకొస్తామని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపిస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. పోలిపల్లిలో నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభలో పాల్గొన్న పవన్‌… జగన్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

యువగళం పాదయాత్ర.. జగన్‌ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని… ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్రని పవన్‌ అన్నారు. ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయని… ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవచ్చని.. తనకు రాని అవకాశాన్ని లోకేశ్‌ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందని జనసేనాని అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగిందని.. ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతివ్వలేదని… సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తనవంతు సాయంగా ఉండాలనే మద్దతిచ్చా అని పవన్‌ అన్నారు. మనకు రాజధాని లేకుండా, సరైన పంపకాల్లేకుండా విభజన జరిగిన కష్ట సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకు మద్దతిచ్చానని… 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్‌కు విలువ తెలియదన్న పవన్‌… ఏదైనా మాట్లాడితే దూషిస్తారు.. దాడులు చేస్తారని అన్నారు. ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని సీఎం జగన్‌.. మహిళలకు ఏం విలువ ఇస్తారని పవన్‌ ప్రశ్నించారు. ఒంటరి మహిళలు అన్యాయాలకు గురవుతున్నారని.. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే తనతో సహా అంతా.. వైసీపీ గూండాలను ఎదుర్కోవటానికి కర్రో, కత్తో పట్టుకోవాల్సి వస్తుందని కేంద్రంలోని పెద్దలకు చెప్పానని పవన్‌ అన్నారు. పొత్తు సాధ్యమైనంత ఎక్కువకాలం.. ఆంధ్రప్రదేశ్‌ నిలదొక్కుకునే వరకు ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.