తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చా. ప్రేమను పంచడం , అందర్నీ సమదృష్టితో చూడటం అలవాటు చేసుకోవాలన్నారు. క్రీస్తు ఆచరించిన ప్రేమ, కరుణ, సహనం ప్రతి ఒక్కరిలోనూ పెంపొందాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆకాంక్షించారు. క్రీస్తు చెప్పిన దయ, త్యాగగుణం, అలవర్చుకుంటేనే జీవితం సంతోషమయమవుతుందన్నారు. యేసు చూపిన సేవామార్గంలో నడిస్తే ప్రతిరోజూ వేడుకేనని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజలందరి పట్ల ప్రేమ, కరుణతో మెలుగుదామని పిలుపునిచ్చారు. క్రిస్మస్ వేడుకలను ప్రజలంతా కలిసికట్టుగా నిర్వహించుకోవాలన్నారు.
వాటికన్ సిటీలో..
ప్రపంచవ్యాప్తంగా కిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాటికన్ సిటీలో క్రిస్మస్ వేడుకలను పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన క్రైస్తవులు క్రీస్తు జన్మదిన సంబరాల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా హంగేరీలో పేదలకు హరే కృష్ణ సభ్యులు అన్నదానం నిర్వహించారు. స్పెయిన్లో శాంతాక్లాజ్ దుస్తులు ధరించి చారిటీ రన్ నిర్వహించారు. జెరూసలెంలో మాత్రం క్రిస్మస్ వేడుకలు బోసిపోయాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో సంబరాలు వద్దని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
మమతా బెనర్జీ ప్రార్థనలు
మరోవైపు భారత్లోనూ క్రిస్మస్ సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల్లో చర్చిలకు వెళ్లి క్రైస్తవ సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్కతాలోని హోలి రోశరి చర్చిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రార్థనలు చేశారు. ఎర్నాకుళంలోని ఇన్ఫాంట్ చర్చిలో జీసెస్ జీవిత గాథను తెలియజేసే స్టాళ్లను ఏర్పాటు చేశారు.