దినదినాభివృద్ది చెందుతున్న నవ్యాంధ్రలో మరో అంతర్జాతీయ కంపెనీ తన ప్లాంట్ పెట్టబోతోంది. రూ.17 వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు అంతర్జాతీయ సంస్థ ఒకటి ముందుకొచ్చింది. అయితే అది ఏ కంపెనీ అనేది ఇంకా అధికారికంగా వెలువడలేదు. సంస్థ షరతులో భాగంగానే పేరును ఎక్కడా కూడా ప్రస్తావించకూడదని గోప్యంగా ఉంచారు. తాజాగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.
ఇటీవలే టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆమరణ దీక్షకూ దిగారు. అయినా మోదీ సర్కారులో కదలిక లేకపోవడంతో ఈ పరిశ్రమ కడప ప్రాంతానికి పెద్ద ఊరటలా భావిస్తున్నారు. మోడీ సర్కారు చేతులెత్తేసిన తరుణంలో రాష్ట్ర ఖనిజాభిృద్ధి సంస్థ, ప్రైవేట్ సంస్థల కలయికలో జాయింట్ వెంచర్‌పై కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది తెలుసుకొన్న ఒక అంతర్జాతీయ కంపెనీ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచింది. ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ను సంప్రదించింది. అయితే తమ సంస్థ పేరును ఎక్కడా వెల్లడించవద్దంటూ ఆ కంపెనీ యాజమాన్యం షరతు పెట్టింది.
దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేంతవరకూ సంస్థ పేరును పొక్కనీయబోమంటూ ఆ కంపెనీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో ఆ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. వనరులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు కడపలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న మెకన్సీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి చూపించింది. కడపలో సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2200 ఎకరాలను కేటాయించింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఇనుప ఖనిజం నిల్వలనూ రిజర్వు చేసి ఉంచింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కేంద్రం మొండి చెయ్యి చూపిన తరుణంలో కడపలో కనుక ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే రాయలసీమ ప్రాంతానికి చెందిన వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.