Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీలపై లోక్ సభ ప్రసంగంలో మోడీ మాటమాత్రమైనా ప్రస్తావించకపోవడంపై ఏపీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు నేతలు మోడీ ప్రసంగంపై మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా కాంగ్రెస్ విభజించిందని ఆరోపిస్తోన్న బీజేపీ మరి తానెందుకు న్యాయం చేయడం లేదని ఎంపీ కేవీపీ ప్రశ్నించారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఏపీకి నాడు ఇచ్చిన హామీలను మోడీ అమలు చేయడం లేదని కేవీపీ దుయ్యబట్టారు . టీడీపీ,బీజేపీ చర్చలు ఒట్టి నాటకమని, ఏపీకి న్యాయంచేసిందేమీ లేదని, చంద్రబాబు వ్యాఖ్యలు మాటలకే పరిమితమని, చేతల్లో ఏమీ లేదని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రసంగం రాష్ట్ర ప్రజలను మరోసారి వంచన చేసేలా ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. సమస్యలను పక్కదోవపట్టించే కుటిల వ్యూహంతో రాష్ట్రానికి మళ్లీ ఒక రాజకీయ అబద్ధపు ఆరోపణల ఉపన్యాసం ఇచ్చారని, న్యాయం కోసం ఆందోళన చేస్తోన్న రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా దగా చేశారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో రాష్ట్రానికి మోడీ అనేక హామీలు ఇచ్చారని, ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని చెప్పిన మోడీ వాటిని ఎందుకు నెరవేర్చలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పై రాజకీయ ఆరోపణలు చేసి తప్పించుకోవడం నరేంద్రమోడీ వంచనలో భాగం తప్ప మరేమీ కాదని మరోసారి రుజువైందన్నారు. మోడీ ఉపన్యాసం వల్ల రాష్ట్రానికి ఏమి హామీవచ్చి టీడీపీ పోరాటం ఆపేసిందో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు.
టీడీపీ, వైసీపీల పోరాటం నాటకం, బూటకం అని తేలిపోయిందని, ప్రధాని ప్రసంగం ప్రారంభంకాగానే టీడీపీ ఎంపీలు నాటకం ఆపి తోకముడిచారని, వైసీపీ ఎంపీలు బాయ్ కాట్ పేరిట పలాయనం చిత్తగించి పారిపోయారని రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులోని హామీలన్నీ అమలు చేయాలని లోక్ సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే కోరుతున్నారని రఘువీరారెడ్డి చెప్పారు. పార్లమెంట్ లో టీడీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, టీడీపీ ఎంపీలు ఒకవైపు ప్లకార్డులతో నిరసనలు తెలుపుతారని, మరోవైపు ప్రధాని మోడీ ప్రసంగానికి చప్పట్లు కొడతారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ తప్పు చేసిందంటున్నారని, మరి బీజేపీ చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు.