Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆ భూతం పుట్టి నేటికీ కచ్చితంగా పదేళ్లు. 2007, జూన్ 29 న ఆ భూతం బయటికి వచ్చింది. దాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన ‘ ఈ విప్లవాత్మక వస్తువుతో అన్నీ మారిపోతాయి’ అని చెప్పేసాడు. తన మానాన తాను ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఆయన వదిలిన భూతం మనిషిని కబళిస్తోంది. పైకి అరచేతిలో ఉన్నట్టు ఉంటూనే ఆ మనిషినే తన గుప్పిట బంధించేస్తోంది. ఒక్క సారి దానికి అలవాటు పడితే అదో మత్తు, వ్యసనం. డ్రగ్స్, మందు, సిగరెట్ వ్యసనం నుంచి బయటపడేందుకు డి అడిక్షన్ సెంటర్స్ వున్నాయి గానీ దీని మత్తులో పడితే పడటమే కానీ పైకి లేచేది ఉండదు. ఇక దీని చిత్రాలు ఒక్కటి కాదు. పక్క పక్కన వుండే మొగుడు పిల్లల్ని విడదీస్తుంది. దరికి చేరడమే కష్టం అనుకునే వాళ్ళతో లింక్ కలిపేస్తుంది. ప్లాస్టర్ లేకుండా నోటికి మూత వేస్తుంది. నిద్ర పోకుండా కంటిని కబ్జా చేస్తుంది. వాస్తవాన్ని ఊహల్లోకి తీసుకెళుతుంది. పక్కవాడి అవసరం లేకుండానే అన్నీ చేసేలా చేస్తుంది. పక్కలో తోడు లేకపోయినా శృంగారం చేయిస్తుంది. ఇన్ని చిత్రాలు చేసే ఆ భూతం పేరు స్మార్ట్ ఫోన్. దాని వయసు పదేళ్లు.
ఆపిల్ కంపెనీ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ పదేళ్ల కిందట స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తూ ‘విప్లవాత్మక ఉత్పత్తిని మార్కెట్ లోకి తెస్తున్నాం, ఇది అన్నిటినీ మార్చేస్తుంది’ అన్నారు. నిజంగా ఆయన చెప్పిందే జరిగింది. అయితే ఆ స్మార్ట్ ఫోన్ తో వచ్చిన మార్పులు పాజిటివ్ కన్నా నెగటివ్ ఎక్కువ. దీని వల్ల బంధాలు, సంబంధాలు పోతున్నాయి. మానసిక సమస్యలు, ఆత్మహత్యలు పెరిగాయి. ఒకప్పుడు ఫలితం, పరిణామాల గురించి ఆలోచించకుండా బాంబుల తయారీ చేసిన వాళ్ళే చివరి రోజుల్లో పశ్చాత్త్తాపం చెందినట్టే స్టీవ్ జాబ్స్ బతికి ఉంటే ఇప్పుడు అలాగే ఫీల్ అయ్యేవాడేమో. కాన్సర్ బారిన పడి చివరి రోజుల్లో స్టీవ్ జాబ్స్ ఏమి మాట్లాడాడో చూస్తే ఈ విషయం తేలిగ్గా అర్ధం అవుతుంది. అప్పుడు జాబ్స్ చెప్పిన మాటలు చూసాకైనా స్మార్ట్ ఫోన్ భూతం బారిన పడ్డ వాళ్ళు కాస్త అయినా మారతారేమో. ఇవే చివరి రోజుల్లో స్టీవ్ మాటలు.
- వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది .
- ఈ నిశిరాత్రిలో… నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడనిపిస్తోంది…జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక, మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలూ, అనుబంధాలూ, చిన్నపాటి కలలూ, కోరికలూ, సేవ … ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది . కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది . అందుకు నేనే ఉదాహరణ .
- ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు . నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు . నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులూ, అందమైన జ్ఞాపకాలు మాత్రమే . ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి. మనల్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయి .
- నిజం, అంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా?… నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను నియమించుకోగలవు . నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ , నీ జబ్బునూ , నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు . నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు .
- జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా – కథ ముగిసే రోజు , తెరపడే రోజు ఒకటి వస్తుంది . అప్పుడు – ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు .అందుకే, కాస్త ముందే కళ్ళు తెరువు .డబ్బును కాదు ,నీ కుటుంబాన్నిప్రేమించు.నీ స్నేహితులను ప్రేమించు .ఆనందంగా జీవించు.