జనసేన-టీడీపీ పొత్తులో చిక్కులు వస్తున్నాయి. పొత్తుని రెండు పార్టీల్లో కొందరు స్వాగతిస్తుంటే..కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జనసేనలో ఓ వర్గం మాత్రం పొత్తు వ్యతిరేకిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబుని సిఎం చేయడానికే పవన్ ఉన్నారని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు తాము సపోర్ట్ చేయమన్నట్లుగానే చెబుతున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా జనసేన-టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
ఈ పరిణామాలు పొత్తుని దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు జనసేన నేతలకు, శ్రేణులకు పొత్తుకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని, అధినేత తీసుకున్న నిర్ణయానికి అంతా కట్టుబడి పనిచేయాలని సూచిస్తున్నారు. ఇందులో ఎలాంటి మార్పు లేదని, కాబట్టి టిడిపి వాళ్ళతో గొడవలు పడవద్దని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే జనసేనకు సపోర్ట్ చేసే కొంత కాపు వర్గం..పొత్తుకు ఒప్పుకునే పరిస్తితి లేదు. మెజారిటీ సభ్యులు పవన్ సిఎం మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. కానీ పొత్తు వల్ల టిడిపి ఆధిపత్యం ఉంటుందని, అలాగే చంద్రబాబుకే సిఎం పదవి ఉంటుంది తప్ప..పవన్‌కు దక్కదు అని చెబుతున్నారు.
అందుకే జనసేనలో పొత్తుని వ్యతిరేకిస్తున్న వారిని సైతం లైన్ లో పెట్టడానికి నాగబాబు కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే జనసేన వారాహి యాత్ర అక్టోబర్ 1 నుంచి మొదలుకానుంది. కృష్ణా జిల్లాలో యాత్ర కొనసాగనుంది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రని విజయవంతం చేయడానికి జనసేన శ్రేణులతో పాటు టిడిపి శ్రేణులు పనిచేస్తున్నాయి. పవన్ తో పాటు స్థానికంగా టిడిపి నేతలు సైతం వారాహి యాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి ఈ సారి వారాహి యాత్ర జనసేన-టీడీపీ శ్రేణులతో భారీగా జరిగే ఛాన్స్ ఉంది.