Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమను తాము గొప్పచరిత్ర, సంస్కృతి ఉన్న వాళ్లుగా భావించటం ప్రతిదేశ పౌరులూ చేస్తుంటారు. ఏ పౌరుడైనా చేయాల్సిన పనే అది. అయితే అదే సమయంలో మరో దేశాన్ని కించపరచకూడదు. తమను తాము ఎంత గొప్పగా భావించినా…వేరే దేశపు ప్రజల్ని మాత్రం చులకన చేయకూడదు. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల ప్రజల్లో ఈ తరహా మాటలు కనపడుతుంటాయి. ఇప్పుడీ జాడ్యం శ్రీలంకకూ అంటుకున్నట్టుంది. ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున రణతుంగ మాటలు చూస్తే ఇలానే అనుకోవాల్సి వస్తుంది. భారత్ శ్రీలంక మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా క్యాండీలో ఆదివారం మూడో వన్డే జరిగింది. అప్పటికే తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి ఉన్న శ్రీలంక మూడో మ్యాచ్ లోనూ పరాజయానికి చేరువయింది. తమ జట్టు ఓటమి అంచుల్లో ఉండటాన్ని తట్టుకోలేక శ్రీలంక అభిమానులు ఆగ్రహంతో మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు. దీంతో అంపైర్లు సుమారు35 నిమిషాల పాటు ఆటను నిలిపివేశారు. తర్వాత భద్రతాసిబ్బంది పరిస్థితిని అదుపులోకి తేవటంతో మ్యాచ్ కొనసాగి భారత్ విజేతగా నిలిచింది. దీనిపై అర్జున రణతుంగ స్పందించాడు.
శ్రీలంక అభిమానుల తీరును తప్పుబట్టాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ…ఈ సందర్భంగా భారత ప్రేక్షకులను విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. లంక అభిమానులు కాస్త ఓర్పుతో, సహనంతో ఉండాలని, సంయమనం పాటించాలని, ఇలాంటి సంఘటనలను పునరావృతం చేయొద్దని రణతుంగ కోరాడు. క్రికెట్ అభిమానుల్ని తాను ఒక్కటే కోరుతున్నానని, దయచేసి భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించొద్దు అని రణతుంగ వ్యాఖ్యానించాడు.
తమకంటూ మంచిసంస్కృతి, చరిత్ర ఉందని, ఇలాంటి ప్రవర్తనను తమ చరిత్ర, సంస్కృతి ఒప్పుకోదని రణతుంగ అన్నాడు. ఈ మాజీ కెప్టెన్ వ్యాఖ్యలపై సో్షల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారతీయులపై వ్యాఖ్యానించేముందు అర్జున రణతుంగ మనదేశ చరిత్ర సంస్కృతి గురించి తెలుసుకోవాలని నెటిజన్లు కామెంట్లుగుప్పిస్తున్నారు. అందరినీ గౌరవించే సంప్రదాయం భారతీయులదని, ఇండియన్ క్రికెటర్లనే కాక…విదేశాలకు చెందిన ఎందరో క్రికెటర్లను భారతీయులు అభిమానిస్తారని, ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణే దీనికి నిదర్శనమని పోస్టులు చేశారు. 1996 వరల్డ్ కప్ లో భారత్ శ్రీలంక మధ్య కోల్ కతాలో సెమీఫైనల్ జరిగింది. మ్యాచ్ లో భారత్ వరుసగా వికెట్లు పోగొట్టుకుంటూ ఓటమి అంచున నిలవటంతో అభిమానులు మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరి, ప్లకార్డులు తగులబెట్టి గొడవచేశారు. అప్పుడు శ్రీలంక కెప్టెన్ అర్జున్ రణతుంగనే. ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన భారత్ ప్రేక్షకులపై వ్యాఖ్యలు చేశాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
మరిన్ని వార్తలు: