సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా ‘ఆర్మీ’.. !

నార్త్ ఇండియన్ సైబర్ నేరగాళ్ళు నగరానికి చెందిన ఆర్మీ అధికారులు, సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుంది. వీరి చేతిలో మోసపోయిన ముగ్గురు ఆర్మీ బాధితులు తాజాగా సిటీ సైబర్‌క్రైమ్‌ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్‌లో పని చేస్తున్న ఓ ఆర్మీ అధికారి ఈ మధ్య జియో ఫోన్‌కు ఆన్‌లైన్‌లో రీ–చార్జ్‌చేసుకున్నారు. అయితే ఆ మొత్తం తన నెంబర్‌కు చేరకపోవడంతో సహాయం కోసం ప్రయత్నించారు. గూగుల్‌లో సెర్చ్‌చేసిన ఆయన అందులో జియో కాల్‌సెంటర్‌పేరుతో కనిపించిన నెంబర్‌కు కాల్‌చేశారు. ఆ సంస్థ ప్రతినిధులుగా స్పందించిన సైబర్‌నేరగాళ్ళు విషయం మొత్తం విన్నారు. తాము పంపే లింకు ఓపెన్‌చేసి, అందులో కోరిన వివరాలు నింపాలని ఆ వెంటనే మీ మొత్తం తిరిగి వస్తుందని నమ్మించారు. సైబర్‌నేరగాళ్ళ నుంచి వచ్చిన లింకును ఓపెన్‌చేసిన ఈయన అందులో కోరిన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఓటీపీని పొందుపరిచారు. వీటి ఆధారంగా సైబర్‌నేరగాళ్ళు ఆయన ఖాతా నుంచి రూ.42 వేలు కాజేశారు.

అదేవిధంగా తిరుమలగిరిలోని ఆర్మీ కార్యాలయంలో పని చేసే ఓ జవాన్‌కు ఈమధ్య జమ్మూ కాశ్మీర్‌కు బదిలీ అయింది. ద్విచక్ర వాహనం లేని ఈయన అక్కడకు వెళ్లే లోపే ఒకటి ఖరీదు చేయాలని భావించారు. దానికోసం ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్‌చేశారు. అందులో ఆర్మీ అధికారి మాదిరిగా.. యాక్టివా 5జీ వాహనం విక్రయం పేరుతో ఉన్న ప్రకటనకు స్పందించారు. బేరసారాల తర్వాత రూ.23 వేలకు వాహనం ఖరీదు చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఆర్మీ అధికారిగా చెప్పుకున్న సైబర్‌నేరగాడు ఆర్మీ ట్రాన్స్‌పోర్ట్‌కోసం రిజిస్ట్రేషన్‌ఫీజు చెల్లించాలని చెప్పడంతో నగరంలో ఉంటున్న జవాన్‌నమ్మేశాడు. ఆ మొత్తం ఆన్‌లైన్‌లో బదిలీ చేయగా… మరికొన్ని చార్జీల పేరు చెప్పి మొత్తం రూ.1.3 లక్షలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. సైబర్‌నేరగాళ్ళు ప్రతి సందర్భంలోనూ వాహనం ఖరీదు తప్ప మిగిలిన అన్ని చార్జీలకు చెందిన నగదు రిఫండ్‌ వస్తుందని చెప్పడంతో బాధితుడు చెల్లిస్తూ పోయాడు.

అంతేకాకుండా సికింద్రాబాద్‌లోని మిలటరీలో పని చేసే మరో జవాన్‌టార్గెట్‌చేసుకున్నారు. ఈయన స్నేహితుడికి ఈ మధ్య మరో ప్రాంతానికి బదిలీ అయింది. ఆయన వెళ్తూ తన ఇన్వర్టర్‌ను అమ్మి పెట్టాలంటూ నగరంలో ఉంటున్న జవాన్‌కు ఇచ్చి వెళ్లారు. దాన్ని విక్రయించడానికి ఈయన ఓఎల్‌ఎక్స్‌ను ఆశ్రయించారు. ఈ ప్రకటన చూశామని.. తమకు నచ్చిందని చెప్తూ సైబర్‌నేరగాళ్ళు కాల్‌చేశారు. సదరు ఇన్వర్టర్‌ఖరీదు చేస్తున్నామంటూ చెప్పి క్యూఆర్‌కోడ్స్‌పంపారు. వీటిని బాధితుడు స్కాన్‌చేయడంతో రూ.44 వేలు నేరగాళ్ళ ఖాతాల్లోకి జారిపోయింది. ఈ ముగ్గురూ తాజాగా సిటీ సైబర్‌క్రైమ్‌పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు ఓటీపీ వంటివివరాలతో బాధితులు పోలీసుల ముందు గోడు వెళ్ల పోసుకున్నారు.