ప్రపంచాన్ని వణికించేస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్య సేతు యాప్‌పై ఈ మధ్య ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది.
అయితే ఈ యాప్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైనికులకు ఆర్మీ హెచ్చరించింది. ఆరోగ్య సేతు యాప్ విషయంలో సైనికులు.. వారి కుటుంబాలు.. మాజీ సైనికులు భద్రత ఉల్లంఘన జరగకుండా సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను అనుసరించాలని సూచించింది. కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ద్వారా.. మన సమీపంలో ఎవరైనా కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు ఉంటే సమాచారం తెలుస్తుంది. అయితే కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైనికులకు ఆర్మీ హెచ్చరించింది.
అదేవిధంగా ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత… బ్లూటూత్ ఆన్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ ఆన్ చేసే ఉంచాలి. అలాగే లొకేషన్ కూడా ఆన్ చెయ్యాల్సి ఉంది. దీంతో మీరు ఏయే ప్రాంతాలకు వెళ్లారో.. ఈ యాప్ గుర్తిస్తుంది. యాప్ లోకేషన్ ఆన్‌చేసి ఉండటం వల్ల శత్రువులకు మన కదలికలు సులువుగా తెలిసిపోతాయి. కాబట్టి సైనికులు ఈ యాప్‌ను కార్యాలయాలు, విధులు నిర్వహించే ప్రాంతాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో వాడకూడదని ఆంక్షలు విధించింది.
అంతేకాకుండా కరోనా వైరస్ కట్టడి కార్యకలాపాల్లో భాగంగా కంటోన్మెంట్స్, మిలటరీ స్టేషన్ల నుంచి పబ్లిక్ ప్రదేశాలు, ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు మాత్రమే బ్లూటూత్, లొకేషన్ ఆన్ చేయాలని స్పష్టం చేసింది. అలాగే.. ర్యాంకు, సర్వీస్ గుర్తింపుతో పాటు తమ వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్‌ను వినియోగిస్తున్న సైనికులు వెల్లడించకూడదని స్పష్టం చేసింది. అలాగే ఎప్పటికప్పుడు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయాలని తెలిపింది.