Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీకి, మిగిలిన ఇంగ్లీష్ న్యూస్ చానళ్లకూ మధ్య మొదలైన రేటింగ్ పంచాయితీ, అటు ఇటు తిరిగి ఎంఎస్‌ఒల మీద పడింది. మల్టిపుల్ ఎల్‌సిఎన్‌లను సహించేది లేదని ట్రాయ్ ఎంఎస్‌ఒలకు హెచ్చరిక ఇచ్చే వరకూ వెళ్లింది. మల్టిపుల్ లాజికల్ చానల్ నంబర్స్ (ఒకే చానల్ వేర్వేరు స్లాట్లలో పెట్టడం) విధానం అమలు చేస్తే ఎంఎస్‌ఒలపై గట్టి చర్యలు తప్పవని హెచ్చరించింది. ఒకే చానల్‌ను ఎక్కువసార్లు పెట్టడం అంటే, బ్రాడ్‌క్యాస్ట్ నిబంధనలను ఉల్లంఘించడమేనన్న ట్రాయ్, ఎంఎస్‌ఒలు నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ట్రాయ్ చట్టంలో చెప్పిన నిబంధనలకు, ఆ చట్టం స్ఫూర్తికి కట్టుబడి ఎంఎస్‌ఒలు పనిచేయాలంది. శాటిలైట్ చానళ్లే కాదు, కేబుల్ చానళ్ల విషయంలో కూడా ఈ నిబంధన పాటించాలి. చాలా మంది ఎంఎస్‌ఒలు తమ ఆధ్వర్యంలో నడిచే కేబుల్ టీవీలను ఇలా పలు స్లాట్లలో పెడుతున్నారని ట్రాయ్ గుర్తించింది. అటువంటి వారిపై కూడా చర్యలు తప్పవంటోంది ట్రాయ్.
ట్రాయ్ నిబంధనల ప్రకారం న్యూస్, ఎంటర్టైన్మెంట్ ఇలా రకరకాల జోనర్లకు సంబంధించిన చానళ్లన్నింటినీ పక్కపక్కనే ఇవ్వాలి. ఒక్కసారే ఇవ్వాలి. చానల్ ప్రకటించుకున్న జోనర్‌లో, మిగిలిన అదే తరహా చానళ్లన్నీ కలిపి ఒక్కచోటే అందివ్వాలి. దానివల్ల ప్రేక్షకుడు ఆ జోనర్‌లో ప్రసారం అవుతున్న అన్ని చానళ్ల వివరాలను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రేక్షకుడు చానళ్లను ఎంచుకోవడం సులువు అవుతుంది. ఒకే తరహా చానళ్లన్నీ పక్కపక్కనే వస్తుంటాయి.
అసలు ఏ చానల్ ఏ జోనర్‌కి సంబంధించింది? అది న్యూసా? ఎంటర్టైన్మెంటా? అని నిర్ణయించుకుని ఆ విషయాన్ని ఎంఎస్‌ఒలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాత్రం చానల్ యాజమాన్యాలదే అని ట్రాయ్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ట్రాయ్ ఈ కింద జోనర్లను గుర్తించింది.
న్యూస్ అండ్ కరెంట్ ఎఫైర్స్
ఇన్ఫోటైన్మెంట్
స్పోర్ట్స్
కిడ్స్
మ్యూజిక్
లైఫ్ స్టైల్
సినిమాలు
భక్తి
వినోదం – హిందీ
వినోదం – ఇంగ్లీష్
వినోదం – ప్రాంతీయ భాషలు
గొడవ ఎలా మొదలైందంటే…
ఆర్నాబ్ గోస్వామి నాయకత్వంలో కొత్తగా ప్రారంభం అయిన రిపబ్లిక్ టీవీ మొదటి వారం రేటింగుల్లోనే నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీనిపై న్యూస్ బ్రాడ్‌క్యాస్టర్స్ అసోసియేషన్ (ఎన్.బి.ఎ) అభ్యంతరం వ్యక్తం చేసింది. మల్టిపుల్స్ స్లాట్లలో పెట్టడం వల్లే రిపబ్లిక్ టీవీ నంబర్ వన్ అయిందని ఆరోపించింది. దీంతో మొత్తం ఇంగ్లీష్ న్యూస్ చానళ్లన్నీ ఒకవైపు, ఆర్నాబ్ గోస్వామి ఒకవైపు నిట్టనిలువునా చీలిపోయాయి.
వివాదంలో గోస్వామి ఎక్కడా తగ్గలేదు. మల్టిపుల్స్ ఎల్‌సిఎన్‌లు ఒక మార్కెటింగ్ టెక్నిక్ అనీ, గతంలో ఎన్నో న్యూస్ చానళ్ళు ఆ విధానాన్ని పాటించాయంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో రిపబ్లిక్ టీవీ మీదా, ఎం.ఎస్.ఒల మీదా చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌ని ఆశ్రయించింది న్యూస్ బ్రాడ్‌క్యాస్టర్స్ అసోసియేషన్. ప్రస్తుతం దీనిపై ట్రాయ్ విచారణ జరుపుతోంది.
ఈ వివాదం ఎంత ముదిరిందంటే, మల్టిపుల్ ఎల్.సి.ఎన్‌లో గొడవ తేలే వరకూ రిపబ్లిక్ టీవీ రేటింగులు ఆపాలని బార్క్ ను కోరాయి ఇంగ్లీష్ న్యూస్ చానళ్లు. దానికి బార్క్ అంగీకరించకపోవడంతో, ఎన్.బి.ఎలో సభ్యులుగా ఉన్న టైమ్స్ నౌ, ఎన్.డి.టి.వి 24×7, సి.ఎన్.ఎన్ – న్యూస్ 18, ఇండియా టుడే టీవీలు బార్క్ రేటింగులను బహిష్కరించాయి. తరువాత చేసేది లేక తిరిగి, బార్క్ వైపు రావడం వేరే సంగతి.
అయితే టీవీ రేటింగుల సంస్థ బార్క్ ఈ వివాదానికి దూరంగా ఉంది. ఇది పరిశ్రమ వర్గాలు తేల్చుకోవాల్సిన వ్యవహారం అనీ, తాము చేయడానికి ఏమీ లేదనేది బార్క్ ఉద్దేశం. ఒక చానల్ ఒకటి కంటే ఎక్కువ ఎల్.సి.ఎన్ లలో ఉన్నప్పటికీ, ప్రేక్షకుల సంఖ్యను కూడి, ఒక చానల్‌గానే తాము నివేదిక ఇస్తామని బార్క్ వివరణ కూడా ఇచ్చింది. పంచాయితీ ట్రాయ్ దగ్గర ఉండగానే, టీవీ టుడే నెట్‌వర్క్ మరో అడుగు ముందుకేసింది. రిపబ్లిక్ టీవీపై దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే, ఆ వెంటనే రిపబ్లిక్ టీవీ వెనక్కు తగ్గింది. తమను తాము న్యూస్ చానల్‌గా ప్రకటించుకుంది. దీంతో టీవీ టుడే గ్రూపు తమ పిటిషన్ వెనక్కు తీసుకుంది.
మొత్తానికి రిపబ్లిక్ టీవీ వర్సెస్ అదర్ న్యూస్ చానళ్ల గొడవతో మల్టిపుల్ ఎల్.సి.ఎన్ ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే శాటిలైట్ చానళ్లతో పాటూ, కేబుల్ చానళ్లూ ఈ నిబంధన పాటించాలన్న ట్రాయ్ సూత్రం మాత్రం ఆచరణలో కష్టమే!
మరిన్ని వార్తలు: