అమృత తండ్రికి బెయిల్….ఏమంటుందో ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు ఏడు నెలల అనంతరం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో పరీక్షల కోసం వెళ్ళిన సమయంలో ప్రణయ్‌ హత్య జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న భార్యకు వైద్య పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తీసుకు వెళ్లిన ప్రణయ్‌ భార్య, మరో కుటుంబ సభ్యురాలితో కలిసి బయటకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన వ్యక్తి కత్తితో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్‌, మరో నిందితుడు కరీంపై గత ఏడాది సెప్టెంబరు 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో ఉంటున్న ముగ్గురు నిందితులు రెండు నెలల క్రితం బెయిలు కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ సమయంలో నిందితులకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందంటూ అప్పట్లో పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో కోర్టు వీరి బెయిలు పిటిషన్‌ తిరస్కరించింది. తమకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల మరోసారి వీరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్‌ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన హైకోర్టు ముగ్గురికీ బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. బెయిల్‌ ఉత్తర్వులు జైలు అధికారులకు అందగానే వీరు విడుదల కానున్నారు. కాగా, ప్రణయ్‌ భార్య అమృత కొద్దినెలల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమృత ప్రణయ్‌ కుటుంబ సభ్యులతోనే కలిసి ఉంటోంది. ఆమె ఈ విషయం మీద ఏమని స్పందిస్తుందో చూడాలి మరి.