Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వినాయకుడు మాంసం తింటున్నట్టుగా ప్రకటన రూపొందించడంపై హిందూవాదులు వ్యక్తంచేసిన అభ్యంతరాలను ఆస్ట్రేలియా అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ బ్యూరో తోసిపుచ్చింది. జీసస్, బుద్ధుడు, ఇతర దేవుళ్లతో కలిసి వినాయకుడు మాంసం తింటున్నట్టు ఆస్ట్రేలియా కు చెందిన ఓ కంపెనీ ప్రకటన రూపొందించింది. ఈ ప్రకటన హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ ఏఎస్ బీకి వివిధ హిందూ గ్రూపుల నుంచి 200కు పైగా ఫిర్యాదులు అందాయి. అయితే వీటన్నింటినీ ఏఎస్ బీ కొట్టిపారేసింది. ఈ ప్రకటనలో ఏ ఒక్క దేవుణ్నీ కించపరిచేలా చూపించలేదని ఏఎస్ బీ అభిప్రాయపడింది. అనేక మతాలకు చెందిన దేవుళ్లు కలిసి భోజనం చేస్తున్నట్టు చూపించడం ద్వారా మత వివక్షను తొలగించారని ప్రశంసించింది. హిందూ మతం మాంసం తినడానికి వ్యతిరేకం కాదని, హిందువులు ఆవును దైవంగా భావిస్తారు కాబట్టి.. గోవుమాంసం మాత్రమే తినొద్దని అంటారని ఏఎస్ బీ వెల్లడించింది. అలాగే ప్రకటన మేక మాంసానికి సంబంధించిందని, అందులో గణేశుడు తింటున్నట్టుగా ఎక్కడా చూపించలేదని తెలిపింది. ప్రకటనలో వినాయకుడి పాత్ర పోషించిన వ్యక్తి కూడా ఒక హిందువే అని, అన్నింటినీ పరిశీలించిన తర్వాతే ప్రకటన షూట్ చేశామని ప్రకటన కర్తలు సమర్పించిన ఆధారాలను ఏఎస్ బీ ఫిర్యాదుదారులకు చూపించింది.