ఖాన్ కాబట్టే శిక్ష, నీచమైన వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి

Asif Khawaja comments on Salman Khan verdict

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చిన్న అవకాసం దొరికితే చాలు సందర్భం ఏదయినా భారత్ మీద విషం కక్కడంలో ముందుండే పాకిస్తాన్ మరో సారి తమ కుటిల బుద్ధిని బయటపెట్టుకుంది. అసలేమాత్రం లాజిక్ లేకుండా మాట్లాడితే ప్రపంచం ఏమనుకుంటుంది అనే విషయం కూడా ఆలోచించకుండా విద్వేషం వెళ్లగక్కటం ఒక్క పాకిస్తాన్ కే సాధ్యం. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ఖవాజా అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో జోధ్ పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్ ను దోషిగా తేల్చి.. ఐదేళ్ల జైలుశిక్షను ఖరారు చేయటం తెలిసిందే. దీనిపై స్పందించిన పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మైనార్టీలపై వివక్ష ఉంటుందని, వారికి ఆ దేశంలో రక్షణ ఉండదని మరోసారి రుజువైందని ఆసిఫ్‌ అన్నారు.

సల్మాన్‌ పేరు చివర ఖాన్‌ లేకుంటే తీర్పు వేరేలా వచ్చి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌లోని అధికార పార్టీ మతాన్ని సల్మాన్‌ కలిగి ఉంటే ఈ శిక్షకు అనర్హుడై ఉండేవాడని ఆరోపించారు. పాక్‌ మంత్రి వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా నెటిజన్లు మండిపడ్డారు. ఒకవేళ భారత్‌లో మైనార్టీలపై వివక్ష ఉన్నది నిజమైతే.. ఇదే సల్మాన్ పై గతంలో హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా ఎందుకు బయటపడేవాడు. ఏదో రకంగా రెచ్చగొట్టాలన్న లక్ష్యం తప్పించి మరింకేమీ లేనట్లుగా పాక్ మంత్రి మాటలు ఉన్నాయని చెప్పాలి. మరి కొందరు అయితే సల్మాన్ ఖాన్ అతని మంతంపై మీకు అంతలా ప్రేమ ఉంటే.. ఆ హీరో సినిమాలు ఏక్తా టైగర్.. టైగర్ జిందాహై చిత్రాల్ని పాక్ థియేటర్లలో ఎందుకు ఆడనివ్వలేదు? అని ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో నిర్దోషిగా బయటపడిన సైఫ్ అలీఖాన్ ది ఏ మతమో మంత్రి చెప్పాలంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. పాక్ మంత్రిగా ముందుగా మీదేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని తర్వాత వేరే దేశాల వ్యవహారాలపై ఆలోచించాలని కొందరు నెటిజన్లు చురకలంటించారు. నిజమే మరి నిలువెత్తు సమస్యలతో కూరుకుపోయిన పాక్ సంగతి చూసుకోక పక్క వారి విషయాలని కదిలించి మరీ తిట్టించుకోవడంలో పాక్ వారికి చేతనయినంత బాగా ఎవరికీ చేత కాదేమో ?