తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు ఈరోజు తెరపడనుంది. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి కెసీఅర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అరగంటపాటు జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తొలుత ఈరోజు ఉదయమే క్యాబినెట్ భేటీ జరిపి అప్పుడే రద్దు నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు, అధికారులకు కూడా ఇదే విధమైన సమాచారం అందింది. కానీ చివరి నిముషంలో వెనక్కి తగ్గిన కెసీఅర్ ఈరోజు మధ్యాహ్నానికి ఈ రద్దు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ఒంటిగంటకు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దు పై తీర్మానం చేయనున్నారు. అనంతరం సీఎం మంత్రులతో కలిసి రాజ్‌భవన్ కు వెళతారు. గవర్నర్ నరసింహన్‌ను కలిసి సభ రద్దు తీర్మానాన్ని అందజేస్తారు. అనంతరం కేసీఆర్ మంత్రులతో కలిసి నేరుగా పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు చేరుకొని మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. అక్కడ ఆయనే స్వయంగా ఈ విషయాన్నీ ప్రజలకు ప్రకటించనున్నారు. అలాగే తొమ్మిది నెలల గడువున్నా అసెంబ్లీని ఎందుకు ముందస్తుగా రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరిస్తారని తెలుస్తోంది. రేపు చివరి శ్రావణ శుక్రవారం కారణంగా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం నుంచి టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు లాంఛనంగా ప్రకటిస్తారు. అయితే తెలంగాణా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నందున ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరనున్నారు. మంత్రులు, కేసీఆర్ యధావిధిగా ఆపద్ధర్మ గా పంసిచేస్తారు కానీ, అసెంబ్లీ రద్దు కారణంగా ఎమ్మెల్యేలు అంతా తమ తమ సభ్యత్వాలు కోల్పోనున్నారు.