హైదరాబాద్ అబిడ్స్‌లోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోల మధ్య ఘర్షణ జరిగి రెండు వర్గాలు పరస్పరం నెట్టుకున్నాయి. గతంలో గచ్చిబౌలిలో ఉద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల విషయమై నెలకొన్న వివాదం 2 సంఘాల మధ్య ఘర్షణకు దారి తీసింది. నిన్న ఆబిడ్స్‌లోని ఏపీఎన్జీవో కార్యాలయంలో ఏపీఎన్జీవోలు పరుచూరి అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సమావేశమయ్యారన్న విషయం తెలుసుకున్న భాగ్యనగర్ టీఎన్జీవో నేతలు అక్కడికి చేరుకున్నారు. స్థలాల కేటాయింపు, డబ్బు విషయమై మాట్లాడుకునేందుకు రావాలంటూ ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి అంతకుముందు పలువురు సభ్యులకు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు… అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డిలను చూడగానే ఒక్కసారిగా చుట్టుముట్టారు.
భేటీలో సొసైటీలో అక్రమాలపై చర్చిస్తున్న సమయంలో అశోక్‌బాబుకు ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త పెరిగి దాడుల వరకు వెళ్లింది. ఈ తోపులాటలో ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి చొక్కా చిరిగిపోయింది. అదే సమయంలో అశోక్‌బాబు మాట్లాడే ప్రయత్నం చేయగా… ముందు డబ్బులు, స్థలాల సంగతి తేల్చాలని భాగ్యనగర్ టీఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు. దీంతో మళ్లీ ఇరువర్గాల నేతలు నెట్టుకున్నారు. అశోక్‌బాబు కింద పడిపోబోతుండగా పక్కనున్న ఉద్యోగులు పట్టుకున్నారు. ఈ తోపులాటలో కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. అశోక్‌బాబుపై దౌర్జన్యం చేశారని ఏపీఎన్జీవోలు ఆరోపించగా… తమకు సంబంధం లేదని భాగ్యనగర్ టీఎన్జీవో నేతలు చెప్పారు. ఘటన అనంతరం ఇరువర్గాల నేతలు ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.