ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి ఉగ్రవాద చర్య ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదు: జైశంకర్‌

Attack on Israel is never an act of terrorism: Jaishankar
Attack on Israel is never an act of terrorism: Jaishankar

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఇజ్రాయెల్​పై హమాస్ దాడులు చేస్తోంటే.. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్​ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇరు దేశాల యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధంపై భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. ఉగ్రవాద చర్య ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7వ తేదీన జరిగిన దాడులు ఉగ్రవాద చర్యేనని జైశంకర్ తెలిపారు. ఇలాంటి ఉగ్ర చర్య ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మరోవైపు పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రోమ్‌లో విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిషన్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న జైశంకర్.. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం గురించి ప్రస్తావించారు.

అక్టోబర్‌ 7న జరిగింది ఉగ్రవాద చర్యేనని.. అందువల్లే ఇజ్రాయెల్‌-గాజాలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని జైశంకర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతోన్న ఈ ఘర్షణలు త్గగి.. మళ్లీ స్థిరత్వం ఏర్పడుతుందనే నమ్మకంతో అందరూ ఉండాలని సూచించారు. ఈ ఇరు దేశాల మధ్య సమస్య ఒక ఉగ్రవాదమే అయితే అందరం కలిసికట్టుగా దానికి వ్యతిరేకంగా పోరాడలని అన్నారు. కానీ ఇక్కడ పాలస్తీనాకు సంబంధించిన అంశం ఉందని.. మొదటగా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని తెలిపారు. ఈ సమస్యకు చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారం అన్వేషించాలని సూచించారు.