Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆస్ట్రేలియా క్రికెటర్ల బాల్ టాంపరింగ్ వివాదంపై ఆ దేశ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా స్పందించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ లో విజయం సాధించాలన్న తపనతోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఉంటుందన్నది నిజమేనని, కానీ బాల్ టాంపరింగ్ లాంటి చర్యలకు పాల్పడి మాత్రం ఎప్పుడూ గెలవాలనుకోదని స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. పోరాట పటిమ, నైపుణ్యంతో మంచి క్రికెట్ ఆడి, చివరి వరకు పోరాడి విజయం కోసం ఆస్ట్రేలియా యత్నిస్తుందని, ప్రస్తుత జట్టులో కూడా ఇలాంటి సంస్కృతే ఉందని భావించానని, కానీ, జట్టులో కొందరు దీన్ని దెబ్బతీశారని స్టీవ్ వా విమర్శించాడు.
2003లో మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ రూపొందించిన స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అనే డాక్యుమెంట్ లో మార్పులు చేశామని, ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు మరింత స్వేచ్ఛగా ఆడతారని భావించామని, కానీ అలా జరగకుండా ఆటగాళ్లు తప్పుదోవ పడుతున్నారని స్టీవ్ వా విశ్లేషించాడు. డాక్యుమెంట్ ను మరోసారి ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చిందని, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా, క్రికెట్ ప్రతిష్ట దెబ్బతినకుండా ఆ మార్పులు ఉండాలని సూచించాడు. ఆసిస్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్ కు పాల్పడడం తనను ఎంతగానో కలిచివేసిందని, ప్రపంచ వ్యాప్తంగా తన ఫేస్ బుక్ ఫాలో అవుతున్న అభిమానులు తనకు దీనిపై ఎన్నో వేల మెసేజ్ లు పంపించారని, వారు ఎంత బాధపడుతూ ఆ మెసేజ్ లు పంపారో వాటిని చదివితే అర్ధమైందని స్టీవ్ వా ఆవేదన వ్యక్తంచేశాడు.