స్టార్‌ హీరోల గురించి అవసరాల కామెంట్స్‌

avasarala srinivas not interested to work with top heroes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడిగా కూడా మంచి ప్రతిభను చూపుతున్నాడు. ఇప్పటి వరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఒక చిత్రాన్ని అవసరాల తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. అయితే ఈయన చిన్న హీరోలతో, కొత్త వారితో మాత్రమే సినిమాలు తీసేందుకు, చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాడు. భవిష్యత్తులో కూడా స్టార్‌ హీరోల జోలికి వెళ్లను అని, స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేందుకు తాను ఆసక్తిగా లేను అంటూ చెప్పుకొచ్చాడు.

ఏ దర్శకుడు అయినా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి, స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలని తాపత్రయ పడతాడు. కాని అవసరాల మాత్రం చిన్న చిత్రాలను చేసి, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. పెద్ద హీరోలతో సినిమాలు చేయాల్సి వచ్చినప్పుడు వారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథను సిద్దం చేయాల్సి ఉంటుంది. అలా చేయాలన్నప్పుడు కొన్ని విషయాలు పక్కకు పెట్టాలి. అంటే కథలో ముఖ్యమైన పాయింట్‌ ఏదైనా ఉంటే ఇమేజ్‌కు తగ్గట్లుగా దాన్ని మార్చాల్సి ఉంటుంది. అందువల్ల కథ మొత్తం మారిపోయే అవకాశం ఉంది అనేది అవసరాల అభిప్రాయం.

ఈయన గతంలో ఒక స్టార్‌ హీరో వద్దకు కథ చెప్పేందుకు వెళ్లాడట. ఆ స్టార్‌ హీరో కథలో పలు మార్పులు చేర్పులు చెప్పి, వాటిని చేసుకుని రావాల్సిందిగా సూచించాడట. ఆ మార్పులు చేస్తే తన కథ పూర్తిగా మారిపోతుందని అవసరాల భావించి మళ్లీ ఆ హీరో వద్దకు వెళ్లలేదట. స్టార్‌ హీరోలతో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న కథను మళ్లీ మళ్లీ మార్చాల్సి వస్తుందని అందుకే తాను స్టార్స్‌తో సినిమా చేయను అంటూ అవసరాల కామెంట్స్‌ చేస్తున్నాడు. అయితే అవసరాల కామెంట్స్‌ను కొందరు దర్శకులు కొట్టి పారేస్తున్నారు.