పి.వి. ఒక అసామాన్యుడు… పి.వి. వర్ధంతి స్పెషల్

PV Narasimha Rao Death Anniversary Special Story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశపు ఆర్థిక సంకెళ్లు తెంచారు మమ్మల్ని గెలిపించారు… రాజకీయంగా మీరు ఓడిపోయారు కానీ మా మనసులు గెలిచారు.. అందులో శాశ్వతంగా నిలిచారు.. పి.వి. వర్ధంతి సందర్భంగా తెలుగు బుల్లెట్ అక్షరనివాళి

ఈ ప్రపంచాన్ని 1 శాతం మంది నియంత్రిస్తుంటారు.స్వార్ధం కోసం 4 శాతం మంది వారి చేతిలో కీలు బొమ్మలుగా మారి పోతారు..మిగిలిన వారి లో 90 శాతం మంది నిద్రావస్థలో ఉంటారు….5 శాతం మంది మాత్రం ఈ విషయాన్ని గ్రహించి వారిలో చైతన్యం రగిల్చేందుకు ప్రయత్నిస్తుంటారు. 90 శాతం మందిని జాగృతం చేసేందుకు 5 శాతం మంది చేసే కృషి ప్రపంచాన్ని నియంత్రించే 1 శాతం మందికి నచ్చదు…ప్రపంచ పోకడల్ని సూటిగా సుత్తిలేకుండా చేసిన విశ్లేషణ ఇది…ఎవరు ఈ విశ్లేషణ చేశారో తెలియదు గానీ ఆధ్యాత్మిక తత్వవేత్తలు సంబంధించిన వెబ్ సైట్ దీన్ని విరివిగా ప్రచారం చేస్తోంది….ఇది నిజమైతే ప్రపంచాన్ని మార్చేపనికి పూనుకొనే 5 శాతం మందిలో మొదటి వ్యక్తిగా నిలిచినవాడు మాజీ ప్రధాని …దివంగత నేత పి .వి .నరసింహారావు …

PV-Narasimha-Rao

సామర్ధ్యం ,నిజాయితీ ,చిత్తశుద్ధి, వినయం, వివేకం,పోరాట పథం…ఇవన్నీ ఒక్కచోట ఉండటం బహు అరుదు…అలాంటి ఓ అరుదైన వ్యక్తి పి.వి.నరసింహారావు …ఈ బలాలే ఓ మారు మూల పల్లెలో పుట్టిన ఆయన్ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్ళాయి .హిందీ యేతర రాష్ట్రాల నుంచి ప్రధాని పీఠం పై నిలిచిన తొలివ్యక్తిగా ఆయన నిలిచారు. కాంగ్రెస్ నెహ్రూ, గాంధీ కుటుంబ వారసత్వ ఆస్తి కాదని కూడా నిరూపించారు. ఇక పదికి పైగా భాషల్లో ఆయనకున్న పట్టు ప్రపంచానికి తెలియందేమీకాదు… ఆయన ఘనతలు అనేకం కానీ… పీవీ రాజకీయ దృఢ చిత్తం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, భారతదేశ దశ దిశల్ని సమూలంగా మార్చేసిన విషయానికి మాత్రం అంతంత మాత్రపు ప్రాధాన్యమే లభించింది. ఆయన పోరాటశైలికి నిదర్శనాలైన కొన్ని వ్యక్తిత్వపు విశిష్టతల్ని చూద్దాం !

PV-Narasimha-Rao

1921 లో కరీంనగర్ జిల్లాలో పివి నరసింహారావు జన్మించారు… విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ రావడంతో ఆయన దృక్పధం మారిపోయింది. సహజంగా మిత భాషి అయిన ఆయన దృష్టి భారత రాజకీయాల పై పడింది. దేశమంతటా బ్రిటిష్ వారికి తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలు పీవీలో స్ఫూర్తి రగిలించాయి. ఉన్నత విద్య కోసం ముంబై నాగ్ పూర్ యూనివర్సిటీలకు వెళ్లడం తో ఆయన ప్రపంచం ఇంకా విశాలమైనది. సమస్యలపై తక్షణ ప్రతిస్పందనగాకుండా లోతైన విశ్లేషణ, పరిష్కారం కోసం చిత్తశుద్ధి తో కూడిన పరిష్కారం కావాలని ఆయన భావించేవారు. అందుకే ఆయన లో యువకుడిగా వున్నప్పటినుంచే ఆవేశం కన్నా ఆలోచన పా ళ్ళు ఎక్కువగా కనిపించేవి… ప్రతివ్యవహారం లోను ఆచితూచి వ్యవహరించేవారు… భవిష్యత్ గమనాన్ని ఊహించుకొని అడుగులు వేసేవారు… వ్యక్తి త్వపు ఉన్నతి వచ్చే కొలదీ రాజకీయ ప్రయాణం కూడా చురుగ్గా సాగింది.

PV-and-Manmohan-Singh

AP కాంగ్రెస్ లో కొన్నికులాలే రాజ్యమేలుతున్న వేళ చెప్పినట్టు వినే వినయ సంపద వల్ల కాబోలు హై కమాండ్ ఆయనకు సీఎం గా అవకాశం ఇచ్చింది. (1971-73) ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు పి.వి. నరసింహారావు ముఖ్య మంత్రి గా వ్యవహరించారు.తాను ఏ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చారో…అదే వ్యవస్థ పై పోరాటానికి ఆయన సంకల్పించారు… సామాజిక సమస్యలకు భూమిపై పెత్తనం మూలకారణమని భావించిన ఆయన భూసంస్కరణలకు శ్రీకారం చుట్టారు… ఓ వైపు సొంత పార్టీలో రాజకీయ వ్యతిరేకులు…మరోవైపు భూస్వాములు ఆయనపై కత్తిగట్టినా …ప్రసన్నంగా కనిపించే పి.వి. పదునుగానే వ్యవహరించారు. తెలంగాణ లో భూసంస్కరణలు ఆయన చిత్త శుద్ధికి నిదర్శనం ..సామాజిక రుగ్మతలకు మందు వేసే క్రమం లో వ్యక్తిగతంగా,రాజకీయంగా ఎంత నష్టమైనా ఫర్వాలేదన్న ధోరణిలోనే ఆయన ముందుకెళ్లారు .ఫలితమే నేడు తెలుగు రాష్ట్రాల్లో బడుగులు అనుభవిస్తున్న గౌరవం..కానీ ఆ క్రెడిట్ ఆయన కు పెద్దగా దక్కలేదు..దాన్ని రాజకీయంగా కన్నా మార్పుకోసం చేసిన ప్రయత్నం గానే ఆ సామాజిక మేధావి భావించివుండొచ్చు .వేళ్లూనుకున్న అసమానత్వపు వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించడానికి పి.వి.రాజకీయ ఆయుధాన్ని వాడుకున్నారంతే …భూసంస్కరణల అంత పెద్ద విజయం ఆయనకు తాత్కాలిక నష్టం చేసిందనుకున్నా ఢిల్లీ కి బాటలు పడిందక్కడే…భవిష్యత్తులో పెద్ద పెద్దపదవులు నిర్వహించే సామర్ధ్యం.తనకుందని నిరూపించుకుంది ఇక్కడే..

PV-Narasimha-Rao

కేంద్ర క్యాబినెట్ లో పి.వి.కీలకంగా వ్యవహరించేవారు…ఆయన సూచనలు ,సలహాలకు ఎంతో విలువ.. రాజకీయంగా సొంత బలం లేని వ్యక్తిని ఎంత ప్రోత్సహిస్తే అంతగా తమకు విధేయంగా ఉంటారని హైకమాండ్ భావించింది.ఆయన కూడా అదేవిధేయతను ప్రదర్శించారు.రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఏది ఆయన బలహీనత అని హైకమాండ్ భావించిందో అదే ఆయన బలంగా మారింది.రాజకీయంగా సొంత బలంలేని నేపధ్యమే ఆయనకు PM పీఠం దక్కడంలో కీలక పాత్ర పోషించింది.

రాజరిక వ్యవస్థలో మంత్రి రాజు అయితే యువరాజు ఎం చేస్తాడు?రాజరికవ్యవస్థ ఏమంటుంది?అవే పరిస్థితులు పి.వి.నరసింహారావు గారికి ప్రజాస్వామ్యంలో ఎదురయ్యాయి.ప్రధాని పీఠం దక్కింది కానీ….ఆ కుర్చీలో కూర్చొని ప్రజలకు జవాబు దారీ కావటం కన్నా …ఇంకెవరి దగ్గరో నిత్యం శీల పరీక్ష జరగడం పీ.వీ.మనసు నొప్పించింది…ఎంతకాలం ఇలా …ఈ అంతర్మధనం లోంచి పి.వి.సరికొత్తగా ఆవిష్కృతమయ్యారు..ప్రజలకే జవాబు దారిగా ఉండాలని నిర్ణయించుకొన్నారు.పీవీ దృష్టి దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడింది.రాజకీయఎత్తుల మాట పక్కన బెట్టి ఆర్థిక సంస్కరణలకు తెరదీశారు.ఎన్ని విమర్శలు ,ఇబ్బందులు ఎదురైనా ముందుకే వెళ్లారు.ఆర్థిక వేత్త మన్మోహన్ కు సంస్కరణల పగ్గాలు అప్ప జెప్పారు.ఆయన అపుడు వేసిన విత్తనాలే నేడు మనకు నీడనిస్తున్న వృక్షాలు.మనం అనుభవిస్తున్న అభివృద్ధి ఫలాలు…

PV-Narasimha-Rao

అభివృద్ధి వేరు… రాజకీయం వేరు… ఈ విషయం అపర చాణిక్యుడు పీవీ కి తెలియదా?తెలుసు… అయినా తన రాజకీయ జీవితం కన్నా… దేశం దశ దిశ మారాలని ఆయన పరితపించారు…చిత్తశుద్ధి తో ప్రయత్నించారు….ఇంతలో బాబ్రీమసీదు వ్యవహారం రాజకీయా సునామీలా ఆయన్ను చుట్టు ముట్టింది….ఇటు స్వపక్షం… అటు విపక్షం… పి.వి ని ఊపిరి తీసుకోనివ్వలేదు… ఒకప్పుడు ఏ రాజకీయముఠాల ముద్ర లేకపోవడం..ఆయన్ను ప్రధాని పీఠం దాకా తీసుకెళ్లింది..అదే బలహీనతగా మారిఆయన పీఠం నుంచి దిగేలా చేసింది….రాజకీయాలేకాదు పీవీ ప్రధాన అస్త్రమైన సంస్కరణలు కూడా జన సామాన్యానికి అంతగా ఎక్కలేదు… ప్రయత్నాలు ఫలితాలుగా మారడానికి పట్టే సమయంలోనే పీవీ పీఠం దిగేశారు.

ప్రధాని పదవి పోయాక ఆర్థికంగా ,రాజకీయంగా,చట్టపరంగా ,పి.వి ఎదుర్కొన్న ఇబ్బందులు సామాన్యమైనవికావు. కోర్టుకేసుల ఫీజుల కోసం ఇళ్ళమ్ముకున్నారు… ఎన్నో అవమానాలు భరించారు… అయినా ఎవరినీఎప్పుడు పల్లెత్తు మాటనలేదు. నిద్రపోతున్న 90 శాతం మందిని జాగృతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేశారు. పరిణితి చెందిన వ్యక్తిగానే బతికారు. అలానే పోయారు… చనిపోయాక కూడా ఆయన్ను అవమానించి కొందరు తన అల్పత్వాన్ని ప్రదర్శించారు. ఏంచేస్తాం… తాము బతికిన కాలంలో నిజమైన మహానుభావులకు ఆ ఘనత ఇచ్చిన సమాజాలు ఇంకా పుట్టలేదు… 90 శాతం మంది నిద్రపోతున్నారుగా!మరెపుడో లేస్తారో

– మీ కిరణ్ కుమార్