ప్రవాస తెలుగు విద్యార్దులచే కోవిడ్-19 మహమ్మారి – మానసిక సమస్యలపై అవగాహన సదస్సు

కోవిడ్ వైరస్‌పై వైద్య సిబ్బంది, మీడియా, ప్రభుత్వం మరియూ ఇతర సంస్థల ప్రచారం పుణ్యమా అని వ్యక్తిగత శుభ్రత చాలా అవసరమని, ప్రతీఒక్కరు వ్యక్తిగత శుభ్రతను పాటించడంతో పాటు తరచూ సబ్బుతో గాని, హ్యాండ్‌ వాష్‌తో గాని అర నిమిషం పాటు చేతులను శుభ్రం చేసుకోవాలని, అలాగే లాక్‌డౌన్‌ను విధిగా పాటించి ఇండ్ల నుండి బయటకు రాకూడదని, సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) ను పాటించాలనే విషయాలపై , ప్రజలకు కొంతమేర అవగాహన కలిగింది.

అయితే ఒక్కసారిగా లాక్ డౌన్ కారణంగా సామాజిక జీవనం స్తంభించి పోవడంతో ప్రజలలో తీవ్ర మానసిక సమస్యలు తలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో ప్రజల సామాజిక జనజీవితాలకు బ్రేక్ పడిందంటున్నారు మానసిక వైద్యులు. అసలే, టెక్నాలజీతో పోటీపడి మరీ.. జీవితాలను కొనసాగిస్తున్న ఆధునిక ప్రజలు, 24 గంటలు తమ గదుల్లో బందీలుగా ఉండవలసిన పరిస్థితిని అతి కష్టం మీద ఎదురీదుతున్నారు.

కొన్ని ప్రాంతాలలో విద్యార్ధులకు పరీక్షలు లేకుండానే పై తరగతికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి, అయితే కొన్ని నిర్ణయాత్మకమైన పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో అనే విషయంలో అంతటా అయోమయం నెలకొని ఉంది. మరి కొన్ని రాష్ట్రాలలో విద్యార్ధులకు ఆన్ లైను క్లాసులు నిర్వహిస్తునారు. ఏతావాతా విద్యార్దులు, వారి తల్లిదండ్రుల తో సహా ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలందరిపై ఎప్పుడూ లేనంత తీవ్ర వత్తిడి నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.

ఈ పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, మేము సైతం అంటూ అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం రాజధాని “శాక్రమెంటో” నగరంలొ ఉన్న విస్తా డెల్ లాగో హైస్కూల్ కు చెందిన ప్రవాస తెలుగు విద్యార్ధులు “కోవిడ్ మహమ్మారి – మానసిక సమస్యల అవగాహన సదస్సు” కు శ్రీకారం చూట్టారు. వారు స్థానిక కాలిఫొర్నీయా యూనివర్సిటీ డేవిస్ – మానసిక వ్యాధుల విభాగం డైరక్టర్ డా. అబ్బెడుటో తో ఈ విషయంపై శుక్రవారం ఏప్రెల్ 10న సాయంత్రం 3గం నుండి 5గం వరకు ఆన్ లైను సదస్సును నిర్వహించారు. విద్యార్ధులు , తల్లిదండ్రులతో సహా యాభైమందికి పైగా ఈ ఆన్ లైను జూం మీటింగ్ సదస్సులో పాల్గొన్నారు.

డాక్టర్. అబ్బెడుటో మానవ అభివృద్ధి వైకల్యాలపై అమెరికన్ జర్నల్‌కు సంపాదకుడిగా కూడా పనిచేస్తున్నారు మరియు అభివృద్ధి వైకల్యాలపై ట్రైనింగ్ కాన్ఫరెన్స్‌ను నిర్దేశిస్తారు. ఆయన పరిశోధన మేధోపరమైన వైకల్యాలున్న వ్యక్తుల ప్రవర్తనా విధానాలపై దృష్టి పెడుతుంది, ప్రత్యేకించి ఆయన ఈ వ్యక్తుల భాష యొక్క అభివృద్ధి సంబంధిన పరిశొధనలు విశృతంగా చేస్తున్నారు. సదస్సులో పాల్గొన్న డాక్టర్ అబ్బేడుటో ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవలి కోవిడ్-19 మహమ్మారి, దాని ఫలితంగా వచ్చే నాడీ మరియు మానసిక సమస్యలు మరియు మానవ సమాజం భవిష్యత్ సంక్షోభాలను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. కోవిడ్-19 రోగులు వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంతో పాటూ, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఏదోఒక వ్యాయామం చేయాలి అని, బలమైన కుటుంబ సంబంధాలు మరియూ స్నేహితుల నుండి ప్రొత్సాహక సంబంధాలు కలిగి ఉండాలి అని, మరియు మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోవిడ్-19 సంబంధిత వార్తలలో ఎక్కువగా మునిగిపోకుండా ఉండాలని ఆయన చెప్పారు. ఆరోగ్య నిపుణులకు ఆయన ఇచ్చిన సలహా ఏమిటంటే, కొన్ని సందర్భాలలో కండరాల బలహీనత దుష్ప్రభావాలను కలిగి ఉన్న మలేరియా మందు – హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి నూతన చికిత్సా విధానాలతో జాగ్రత్తగా ముందుకు సాగడం, ముఖ్యంగా నాడీ కదలిక రుగ్మతల లేదా మనసిక సమస్యల చరిత్ర ఉన్న రోగులకు కోవిడ్ చికిత్స చేసేటప్పుడు వైద్యులు మరింత జాగ్రత్తగా వ్యవరించాలని ఆయన చెప్పారు.

ప్రవాస తెలుగు విద్యార్దులచే కోవిడ్-19 మహమ్మారి - మానసిక సమస్యలపై అవగాహన సదస్సు - Telugu Bullet

కోవిడ్-19 వంటి మహమారి వైరస్ లు ముందుగా చెప్పిరావు కాబట్టి, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు మరియు మన సమాజం భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి మరింత సిద్ధంగా ఉండాలి అని ఆయన నొక్కి చెప్పారు. “కోవిడ్ మహమ్మారి” మూలంగా తలెత్తిన మానసిక సమస్యలపై కాలిఫొర్నీయా యూనివర్సిటీ డేవిస్ – మానసిక వ్యాధుల విభాగం డైరక్టర్ డా. అబ్బెడుటో ప్రసంగం వినడమే కాకుండా, వారిని ప్రశ్నలు అడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశాన్ని సద్దస్సులో పాల్గొన్నవారు వినియోగించుకున్నారు. చొరవ తీసుకొని కోవిడ్-19 మహమ్మారి – మానసిక సమస్యలపై ఆన్ లైనులో అవగాహన సదస్సు ను సమర్ధవంతంగా నిర్వహించిన ప్రవాస తెలుగు హై స్కూల్ విద్యార్ధులు “విశృత్ నాగం, నీల్ త్రివేది, శ్రేయా తోట” లను వారు అభినందించారు. ఈ సదస్సు నిర్వహణకు చొరవ చూపిన విశృత్ నాగం బృందం ను డాక్టర్. అబ్బెడుటో అభినందించారు. కోవిడ్-19 సమస్య సర్దుకున్న పిదప స్థానిక కాలిఫొర్నీయా యూనివర్సిటీ డేవిస్ – మానసిక వ్యాధుల విభాగంలో విద్యాపరమైన పర్యటనకు విశృత్ నాగం బృందం ను ఆయన ఆహ్వానించారు. విశృత్ నాగం సదస్సుకు విచ్చేసిన డాక్టర్. అబ్బెడుటో కు, సదస్సు హాజరైన ఆహుతులందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.