Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకరు మాజీ మంత్రి… ఇంకొకరు మంత్రి. ఇద్దరూ మాటకారులే. ఎంతో సున్నితమైన ఓ కుల ప్రస్తావన విషయంలో అందరి ముందే మాజీ మంత్రికి క్లాస్ పీకారు మంత్రి గారు. అయినా ఆ మంత్రి గారు చెప్పిన దాంట్లో విషయం ఉండటంతో ఎవరూ నోరు మెదపలేకపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ కి కవి గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు వేదికగా నిలిచాయి.
ఈ ఉత్సవ సభలో గుర్రం జాషువా గురించి గొప్ప విషయాలు చెప్పిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కుల ప్రస్తావన తెచ్చారు. జాషువా తండ్రి యాదవ అని, తల్లి మాదిగ అని రావెల చెప్పారు. అయినా జాషువా విషయంలో మాదిగ సోదరులు స్పందించినట్టు యాదవులు స్పందించడం లేదని రావెల కామెంట్ చేశారు. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడిన జాషువా అని చెప్పిన రావెల కూడా అదే కుల ప్రస్తావన చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద గుర్రం జాషువా విగ్రహాన్ని పడగొట్టకుండా అడ్డుకున్న మాదిగ సోదరుల్ని తాను ప్రత్యేకంగా సన్మానించినట్టు రావెల చెప్పుకున్నారు.
అదే సభలో ఆ తరువాత మాట్లాడిన మంత్రి అయ్యన్న పాత్రుడు రావెలకి కౌంటర్ వేశారు. దేశం కోసం, సమాజంలో మంచి మార్పు కోసం ధైర్యంగా పోరాడిన వారిని మా వాడు అంటూ కొందరికే పరిమితం చేయడం సమంజసం కాదని అయ్యన్న అన్నారు. తన రచనల ద్వారా అందరినీ జాగృతం చేసిన జాషువా అందరివాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు రావెల ని ఉద్దేశించి ఆయన అన్నారని ఆ సభలో అందరికీ అర్ధం అయిపోయింది.