అయ్యన్న కుటుంబంలో ముసలం…వైసీపీలోకి తమ్ముడు…!

Ayyanna Patrudu Sanyasi Patrudu Conflicts Ap Tdp Narsipatnam

పార్టీలో గొడవలు ఉంటే సర్దుబాటు చేసుకోవచ్చు, కానీ నాయకుడి ఇంట్లోనే కలహాల కుంపటి రగులుకోవడంతో ఈ మంటలను ఆర్పడం ఇపుడు ఎవరి తరం కావట్లేదు. అయ్యన్న సైతం చేతులెత్తేసిన ఈ వివాదం పార్టీని సైతం ఓ కుదుపు కుదుపుతోంది. తన అన్న కొడుకు విజయ్ పాత్రుడు పార్టీలో పెత్తనం చేస్తున్నాడంటూ అయ్యన్న తమ్ముడు, నర్శీపట్నం మునిసిపాలిటీ వైఎస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు ఏకంగా చంద్రబాబుకే ఫిర్యాదు చేయడంతో వివాదం రచ్చకెక్కింది. నిజానికి అయ్యన్నకు తమ్ముడే బలం. పార్టీలో పలు మార్లు అయ్యన్న గెలవడం వెనక తమ్ముడు సన్యాసి పాత్రుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండేది కూడా సన్యాసిపాత్రుడే. మంత్రిగా అయ్యన్న బిజీగా ఉంటే పార్టీ పనులు చక్కబెట్టి, కార్యకర్తల సమస్యలు తీర్చేది ఆయనే. మరి అటువంటి తమ్ముడు ఇపుడు తిరుగుబాటు చేశాడు.

అది అయ్యన్నకు నిజంగా శరాఘాతమేనంటున్నారు. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఎన్నికలు దగ్గరకు వచ్చేయడంతో సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.అందుకు తగ్గట్టుగానే నర్సీపట్నం వైసీపీ నాయకులు ఈమధ్య తరచుగా సన్యాసి పాత్రుడిని కలిసి తమ పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారట. సన్నాసినాయుడుకి తన అన్నఅయ్యన్న కుటుంబతో ఉన్న విభేదాలు కారణంతో ఆయన వైసీపీలో చేరటానికి సిద్ధంగానే ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆయనకు నర్సీపట్నం మున్సిపాలిటీలో మంచి పట్టు ఉండటంతో సన్యాసి పాత్రుడు కనుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే ఆ నియోజకవర్గం కచ్చితంగా తమకే దక్కుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు ఇక్క టీడీపీ ఓట్లు కూడా చీలిపోతాయి. దీంతో నియోజకవర్గాన్ని తమ గుప్పెట్లో తెచ్చుకోవచ్చని అనుకుంటున్నారు.

ఇక వైసీపీ ఆఫర్‌కి సన్యాసిపాత్రుడు కూడా సముఖంగానే ఉన్నారని సమాచారం. కాకపోతే తనకు టికెట్ కేటాయిస్తానంటేనే పార్టీలో చేరతాను అని షరతు పెట్టారట. ప్రస్తుతానికి ఈ విషయంపై సన్యాసి పాత్రుడితో వైసీపీ నేతలు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారు. మరోపక్క అక్కడి వైసీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాల పాప ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో చేర‌డానికి సిద్దం అవుతున్నారు. ఈ స‌మ‌యంలో త‌మ‌కు ప‌ట్టు ఉన్న ఆ న‌ర్సీప‌ట్నం సెగ్మెంట్లో అవ‌కాశం ఇవ్వాలి అని కోరుతున్నారు, అయితే అయ్య‌న్న‌కు వ్య‌తిరేక వ‌ర్గం ఆమెకు టికెట్ ఇప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా, ఆ హామీ మాత్రం సీఎం నుంచి తీసుకోలేక‌పోతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.