బాలయ్య 103 కన్ఫర్మ్‌… ఒక్కసారి ఆలోచించు…

Balakrishna again acts with Puri jagannadh Directions

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపిక విషయంలో ఎక్కువగా ఆలోచించడు అనే విషయం ఆయన కెరీర్‌ను మొదటి నుండి గమనిస్తే ఈజీగా తెలిసి పోతుంది. తనకు నచ్చింది అనిపిస్తే వెంటనే చేసేస్తాడు. తనకు ఒక దర్శకుడి తీరు బాగుంది అనిపిస్తే ఆ దర్శకుడితో వెంటనే సినిమాకు కమిట్‌ అవుతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలా చేయడం వల్లే ఎన్నో సినిమాలు బాలయ్య కెరీర్‌లో ఫట్‌ అయ్యాయి. అయినా కూడా బాలయ్య మాత్రం తన పద్దతి మార్చుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. ఇటీవలే ‘పైసా వసూల్‌’ చిత్రంతో పూరితో వర్క్‌ చేసిన బాలయ్య అప్పుడే మరోసారి పూరితో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. 

బాలయ్య ప్రస్తుతం తన 102వ చిత్రాన్ని కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. సి కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఆ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. సంక్రాంతికి తప్పితే ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు. ఇంకా 102వ చిత్రం షూటింగ్‌ ముగియకుండానే అప్పుడే తన 103వ చిత్రానికి బాలయ్య కమిట్‌ అయ్యాడు. పైసా వసూల్‌ సమయంలోనే పూరితో మరో సినిమా చేస్తాను అంటూ బాలయ్య మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం తన 103వ సినిమాను పూరికి ఇచ్చేశాడు. 

ప్రస్తుతం కొడుకుతో ‘మెహబూబా’ అనే చిత్రాన్ని చేస్తున్న పూరి జగన్నాద్‌ ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేసేందుకు అప్పుడే కథ కూడా సిద్దం చేశాడు. కొన్ని వారాల క్రితం బాలయ్యకు పూరి కథ చెప్పడం స్టోరీ లైన్‌ బాగుండటంతో తప్పకుండా చేద్దామని, తన 103వ చిత్రంగా దీన్ని చేద్దాం అంటూ పూరికి హామీ ఇచ్చాడు. బాలయ్య తన తండ్రి జీవిత చరిత్రతో సినిమాను చేయాలని భావిస్తున్నాడు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. అయితే స్క్రిప్ట్‌ వర్క్‌కు సమయం చాలా పడుతున్న కారణంగా తన 103వ చిత్రాన్ని పూరితో చేసి, 104వ చిత్రాన్ని ఎన్టీఆర్‌ జీవిత చరిత్రతో చేయాలని బాలయ్య ఫిక్స్‌ అయ్యాడు. పూరితో మళ్లీ సినిమా విషయంలో మరోసారి ఆలోచించాలని నందమూరి ఫ్యాన్స్‌ బాలయ్యకు సూచిస్తున్నారు.