ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరుపున పోటీ చేసే మొదట అభ్యర్థిని ఆయన ఈరోజు ప్రకటించారు. ఎన్నికల్లో మొట్టమొదటి బీఫారం పితాని బాలకృష్ణకు కేటాయిస్తానని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానం నుంచి పితాని బాలకృష్ణ ఏపీ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆ పార్టీకి ఆగస్టు 22న రాజీనామా చేశారు. అనంతరం జనసేన పార్టీలో చేరారు. మరో 8 ఏళ్లు తనకు ప్రభుత్వ సర్వీసు ఉన్నా వైసీపీ అధినేత జగన్ టిక్కెట్ ఇస్తారనడంతో ఉద్యోగాన్ని వదులుకున్న పితాని ఆ పార్టీలో చేరారు.
అయితే ఆ ఎన్నికల్లో పితానికి టికెట్ ఇస్తానని చెప్పిన వైఎస్సార్ సీపీ ఆ తర్వాత పొన్నాడ సతీశ్‌కు కన్ఫార్మ్ చేసింది. పొన్నాడ సతీశ్.. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరారు. ఈ సారి కూడా టికెట్ కష్టమే అని తేలడంతో ఈయన జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 3 సార్లు తెలుగుదేశం, 4 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. గత ఎన్నికల్లో వైకాపా తెలుగుదేశం పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ జరిగినా తెలుగుదేశం నుంచి దాట్ల సుబ్బరాజు దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఇదిలా ఉంటె వలస నేతలకు టికెట్ లు ఇచ్చేది లేదని గతంలో పవన్ కళ్యాణ్ సూచన ప్రాయంగా చెప్పి ఇప్పుడు పార్టీ మారిన వెంటనే బాలకృష్ణకు టికెట్ ఖరారు చేయడం పై ఎప్పటి లానే పవన్ నిర్ణయం మీద నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.