నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని సొంత బ్యానర్ ఎన్‌బికే పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. పేరుకు సాయి కొర్రపాటి, విష్ణులు కూడా ఈ చిత్రానికి నిర్మాతలు అయినప్పటికి మెజార్టీ వాటా బాలకృష్ణది అంటూ సమాచారం అందుతుంది. బాలకృష్ణ ఈ చిత్రం కోసం అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేస్తున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సమయంలోనే బాలకృష్ణకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో మరియు రాజకీయ, సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం బాలకృష్ణ స్టూడియో నిర్మాణం కోసం ఏకంగా 315 ఎకరాల భూమిని తక్కువ రేటుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్‌లోని భీమిలి రోడ్డులో ప్రభుత్వం బాలకృష్ణకు తక్కువ రేటుకు 315 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఏపీలో సినిమా నిర్మాణం పెరగాలని, సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని చంద్రబాబు నాయుడు ఆశ పడుతున్నాడు. అందుకే ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలతో నిర్మాతలకు భూమలు ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. అందులో మొదటగా బాలకృష్ణకు తక్కువ రేటుకు స్టూడియో నిర్మాణంకు స్థలం కేటాయించడం జరిగింది. త్వరలోనే బాలకృష్ణ ఎన్‌బికే స్టూడియోస్ పేరుతో భారీ ఇండోర్ మరియు ఔట్ డోర్ చిత్రీకరణకు అనుకూలంగా స్టూడియోను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. స్టూడియో నిర్మాణ పనులు వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ కుటుంబానికి ఇప్పటికే హైదరాబాద్‌లో రామకృష్ణ సినీ స్టూడియో ఉంది. ఇప్పుడు బాలకృష్ణ ప్రారంభిస్తే రెండవ స్టూడియో కానుంది.