ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏదైనా అనుకోని పరిణామం జరగబోతోందా? కొన్నాళ్లుగా టీడీపీ లో అసంతృప్తితో రగిలిపోతున్న కరణం బలరాం పెద్ద అడుగు వేయబోతున్నారా ? ఎస్ .ఈ ప్రశ్నకు ఔను అనే సమాధానం చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అద్దంకి రాజకీయాలు అని వేరే చెప్పక్కర్లేదు. ఆది నుంచి దేశంలోకి గొట్టిపాటి రవి రాకని బలరాం వ్యతిరేకిస్తున్నారు. ఆ క్రమంలో ఎన్ని గొడవలు అయ్యాయో రాష్ట్రం అంతా చూసింది. విషయం హైకమాండ్ దాకా చేరడంతో అద్దంకి లో కలగజేసుకోవద్దని బలరాం కి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. అయినా వేడి చల్లారకపోవడంతో బలరాం కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితులు ఇంకాస్త ఇబ్బందికరంగా మారాయి. దీంతో బాబు తీవ్ర స్వరంతో హెచ్చరికలు చేశారు. అయినా ప్రయోజనం తాత్కాలికమే అనిపిస్తోంది.
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ప్రకాశం రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న సంకేతాలు అందుతూనే వున్నాయి. అందుకు తగ్గట్టే ఈరోజు బలరాం వ్యవహారశైలి వుంది. చక్రాయపాలెం పంచాయితీ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇందుకోసం భారీగా జనసమీకరణ చేశారు. అద్దంకి ఎమ్మెల్యే ఉండగా ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనవద్దని బలరాం కి ఇంతకుముందే పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వున్నాయి. అయినా బాబు మాట అంటే లెక్క లేనట్టు ఈ స్థాయిలో బలప్రదర్శన చేయడానికి పూనుకున్నారు అంటే బలరాం మనసులో ఏదో వుంది అన్న సందేహాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఆయన వైసీపీలో చేరొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ప్రతి సందర్భంలో ఆ ప్రచారాన్ని బలరాం ఖండిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కూడా బలరాం పాత వైఖరికే కట్టుబడ్డారు అంటే తిరుగుబాటు జెండా రెపరెపలాడినట్టేనా ?