Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నూలు జిల్లా మంత్రి భుమా నాగిరెడ్డి-శోబా నాగిరెడ్డిల కుమార్తె అఖిల ప్రియ విషయంలో రోజుకో వివాదం వెలుగులోకి వస్తోంది. తాజాగా మంత్రి అఖిలప్రియకు, బనగానపల్లి ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇటీవలి మహానాడుకు గైర్హాజరైన కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి నిన్న రాత్రి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మంత్రి అఖిలప్రియ తీరు మీద ఆయన చంద్రబాబుకు ఫిర్యాదుచేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి అఖిలప్రియ తన ప్రత్యర్థులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుకు జనార్దన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. 2014 ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత కాటసాని రామిరెడ్డికి… మంత్రి ఇటీవల ఒక కాంట్రాక్టు పని అప్పగించారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టు ద్వారా వచ్చే డబ్బుతోనే వచ్చే ఎన్నికల్లో కాటసాని తనపై పోటీకి దిగుతారని తన పరిస్థితి ఏమిటని సీఎంకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది.
కాటసాని రామిరెడ్డి అఖిలప్రియ సోదరుడైన నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి స్వయానా మామ అందుకే ఆయనకు ఆదాయం చేకూరేలా ఆమె ఈ కాంట్రాక్ట్ అప్పగించినట్టు తెలుస్తోంది. అప్పటి నుండి మంత్రి తీరుపై జనార్దనరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మినీ మహానాడును నియోజకవర్గంలో నిర్వహించకపోగా జిల్లా మినీ మహానాడు, మహానాడు కార్యక్రమాలకు కూడా ఆయన రాలేదు. ఇటీవల చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో కూడా పాల్గొనలేదు. దీంతో అలక విషయం అధినాయకత్వానికి తెలిసింది. అందుకే ముఖ్యమంత్రి ఆయన్ను పిలిపించుకుని మాట్లాడారు. ఈ అంశంపై తాను ఆరా తీసి చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డికి హామీ ఇచ్చారు.