Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బంగ్లాదేశ్ మరోమారు అంచనాలకు మించి రాణించింది. చిన్నజట్టు ముద్రను తొలగించుకుని… అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న బంగ్లాదేశ్ సంచలన విజయాలు నమోదుచేస్తోంది. పెద్ద జట్లకు బంగ్లాదేశ్ ఏ మాత్రం తీసిపోదని… కొలంబోలో జరిగిన నాకౌట్ మ్యాచ్ మరోసారి నిరూపించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్ లో భారత్ బంగ్లాదేశ్ తలపడనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సొంత అభిమానుల మధ్య జరగుతున్న మ్యాచ్ లో శ్రీలంక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఇది చాలా మంచి స్కోరు. గెలుపు దాదాపు ఖరారు చేసే స్కోరు. అయితే 160 పరుగుల విజయలక్ష్యంలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ తీవ్ర ఉత్కంఠ మధ్య ఒక బంతి మిగిలిఉండగా విజయంసాధించింది.
మ్యాచ్ లో బంగ్లాతో విజయం దోబూచులాడింది. ఒకదశలో 97 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం దిశగా సాగిన బంగ్లా ఆ తర్వాత కాసేపటికే 4 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మహ్మదుల్లా వీలు చిక్కినప్పుడల్లా షాట్లు కొడుతూ బంగ్లాను పోటీలో ఉంచాడు. ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేస్తే కానీ బంగ్లా విజయం సాధించలేని స్థితిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 19వ ఓవర్ చివరి బంతికి పరుగులేమీ చేయకుండానే మెహదీ హసన్ రనౌట్ అయ్యాడు. 12వ ఓవర్ తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బాల్ కీ అదే పరిస్థితి. ఉదాన వేసిన షార్ట్ పిచ్ బంతి బ్యాట్ కు తగలకపోయినా ముస్తాఫిజుర్ పరుగెత్తడం, రనౌట్ కావడం జరిగిపోయాయి. దీంతో బంగ్లాదేశ్ ఓడిపోయినట్టేనని అంతా భావించారు. అయితే బ్యాట్స్ మెన్ భుజం కన్నా ఎక్కువ ఎత్తులో బంతిని విసిరినా… అంపైర్ నోబాల్ ఇవ్వకపోవడంపై బంగ్లా ఆటగాళ్లు ప్రశ్నించడంతో వివాదం మొదలయింది. లెగ్ అంపైర్ నో బాల్ సిగ్నల్ ఇవ్వడం తాము చూశామని బంగ్లా ఆటగాళ్లు వాదించారు.
బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ పెవిలియన్ లో కూర్చుని… ఆగ్రహంతో ఊగిపోతూ ఇక ఆడొద్దు… వచ్చేయండంటూ పదే పదే తమ బ్యాట్స్ మెన్ ను పిలవడంతో అభిమానులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తో పాటు బంగ్లా కోచింగ్ సిబ్బంది ఆటగాళ్లను శాంతిపంచేయడంతో మళ్లీ మ్యాచ్ కొనసాగింది. ఆడిన తొలిబంతినే బౌండరీకి తరలించిన మహ్మదుల్లా… నాలుగో బంతికి డబుల్ తీశాడు. ఐదో బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా అద్భుత సిక్సర్ గా మలిచి బంగ్లాకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. అనూహ్య విజయంతో బంగ్లా ఆటగాళ్లు అమితమైన ఆనందంతో మైదానంలోకి దూసుకొచ్చి నాగిని డాన్స్ చేశారు. కెప్టెన్ షకిబుల్ అయితే చొక్కా విప్పేసి మైదానంలో గంతులేశాడు. విజయానికి చేరువైన స్థితి నుంచి అనుకోని రీతిలో పరాజయం పాలవడంతో శ్రీలంక ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.