ఈఎంఐ మారటోరియం ఆప్షన్ కింద సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కేంద్రం కల్పించిన ఈఎంఐ వాయిదా అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అమాయకజనానన్ని టార్గెట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. సామాన్యులకు బ్యాంకు ఈఎంఐలు, రుణాల చెల్లింపుల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈఎంఐ మారటోరియం ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఆప్షన్ ఎంచుకున్న వారు మూడు నెలల పాటు ఈఎంఐలు, రుణాల చెల్లింపులు వాయిదా వేసుకోవచ్చు. మే 31 వరకూ ఈ అవకాశం కల్పించింది.
ఇది నిజమైన లబ్ధిదారులకు ఎంత ఊరటనిచ్చిందో తెలియదు కానీ సైబర్ కేటుగాళ్లకు మాత్రం పంట పండిస్తోంది. అదేమంటే.. ఈఎంఐ వాయిదా ఆప్షన్ వినియోగించుకోవాలనుకొనే వారిని టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకుల నుంచి పంపిస్తున్నట్లుగా ఖాతాదారుల సెల్ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు.. ఈ మెయిల్స్ పంపి యాప్‌ని డౌన్లోడ్ చేసుకోమని కోరుతున్నారు. ఆ తర్వాత ఆ ఎస్సెమ్మెస్‌లోని లింక్‌ని క్లిక్ చేయగానే యాప్ డౌన్లోడ్ అవుతుంది.
ఆ యాప్‌లో బ్యాంకు ఖాతా వివరాలతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, సీవీవీ నంబర్లకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని అడుగుతుంది. అంతే అదే నిజమనుకొని వివరాలు ఎంటర్ చేస్తే ఆ వెంటనే బ్యాంకు ఖాతాలోంచి డబ్బు మాయం అవుతోంది. అప్పటికే సైబర్ కేటుగాళ్లు లింక్ ఓపెన్ చేసిన వారి సెల్‌ఫోన్, కంప్యూటర్లను రిమోట్ టెక్నాలజీ ద్వారా వారి ఆధీనంలోకి తెచ్చుకుంటారు. బ్యాంకు ఖాతాదారుడు యాప్‌లో వివరాలు నమోదు చేసిన వెంటనే పిన్, సీవీవీ ఎంటర్ చేయాలని మెసేజ్ వస్తుంది.
అవి ఎంటర్ చేయగానే బ్యాంకు ఖాతాలోని నగదును దోచుకుంటున్నారు. అయితే ఇది ఏకంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన పీఎం కేర్స్ ఫండ్కే ఎసరు పెట్టారు సైబర్ కేటుగాళ్లు. కరోనా బాధితులను ఆదుకునేందుకు సాయమందిచాల్సిందిగా కోరుతూ ప్రధాన మంత్రి ప్రారంభించిన పీఎం కేర్స్ ఫండ్‌నే కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు.
కేవలం ఒక్క అక్షరం తేడాతో ఏకంగా పీఎంకేర్స్ ఫండ్ నకిలీ యూపీఐ ఐడీలను క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్లు విరాళాలను దోచుకునేందుకు ట్రై చేసిన వారిని హైదరాబాద్ పోలీసులు గుర్తించి.. సుమోటోగా కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఏ బ్యాంకు కూడా సీక్రెట్ పిన్ నంబర్లు, డెబిట్.. క్రెడిట్ కార్డుల వంటి వాటి వివరాలను అడగదని హెచ్చరిస్తున్నారు. కాగా అలాంటి వాటిని బ్యాంకులు అడగవని.. ఆ కీలక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలపవద్దని సూచిస్తున్నారు.