సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బుధవారం మధ్యాహ్నం ఆయనను కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. బుద్ధదేవ్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నెగెటివ్‌గా వచ్చినట్టు తెలిపారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రక్తంలో ఆక్సిజన్, పీహెచ్ స్థాయిలు తగ్గి కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువయ్యిందన్నారు. న్యుమోనియా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని సీటీ స్కాన్‌లో తేలిందన్నారు.
రెండుసార్లు బెంగాల్ సీఎంగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్యా వయస్సు ప్రస్తుతం 76 ఏళ్లు. ఆయన గత కొంతకాలంగా హృదయ సంబంధ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి, చికిత్సను అందజేయడానికి ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రి ఓ టీం ఏర్పాటు చేసింది. బుద్ధదేవ్‌ను కలిసేందుకు మాత్రం ఎవరినీ అనుమతించడంలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత మిశ్రా తెలిపారు. శ్రేయోభిలాషులు ఆస్పత్రి యాజమాన్యంతో సహకరించాలని కోరారు.
బుద్ధదేవ్ ఆరోగ్య పరిస్థితిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన దీదీ.. ‘అనారోగ్యానికి గురైన బుద్ధదేవ్ శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడుతూ ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు’. అనంతరం ఆస్పత్రికి వెళ్లిన మమత.. బుద్ధదేవ్ సతీమణి, కుమార్తెను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పశ్చిమ్ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.జ్యోతిబసు తర్వాత బుద్ధదేవ్ 2000 నుంచి 2011 వరకు పశ్చిమ్ బెంగాల్ సీఎంగా పనిచేశారు. వయసు పైబడటం, అనారోగ్య కారణాలతో సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో నుంచి 2018లో తప్పుకున్నారు.