‘భీష్మ’ మూవీ రివ్యూ

‘భీష్మ’ మూవీ రివ్యూ

నితిన్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీష్మ’. ‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సారి పక్కా హిట్ కొడతానన్న ధీమాతో ఉన్న నితిన్ నమ్మకాన్ని ‘భీష్మ’ నిజం చేసిందో లేదో ఇప్పుడు చూద్దాం..

భీష్మ ఆర్గానిక్స్ ఎండి అయిన భీష్మ(అనంత్ నాగ్) తన కంపెనీకి సైరైన వారసుడి కోసం చూస్తున్నానని అనౌన్స్ మెంట్ ఇవ్వడంతో మూవీ మొదలవుతుంది. మరోవైపు పెద్దగా పని లేని కుర్రాడు భీష్మ (నితిన్). భీష్మ అనుకోకుండా పోలీస్ కమీషనర్ అయిన సంపత్ రాజ్ దగ్గర పనిలో చేరతాడు. ఆ టైంలో సంపత్ కుమార్తె చైత్ర(రష్మిక మందన్న)తో ప్రేమలో పడతాడు. కానీ సంపత్ రాజ్ కి భీష్మ నరేష్ కొడుకు అని తెలియగానే ఇద్దరి మధ్య ఓ పెద్ద గొడవ. అప్పుడే నరేష్ భీష్మ తన కొడుకు కాదని భీష్మ ఆర్గానిక్స్ వారసుడని ప్రకటిస్తాడు. దాంతో కథ మలుపు తిరుగుతుంది. అప్పటి వరకూ భీష్మ ఆర్గానిక్స్ గురించి ఐడియా లేని భీష్మ ఎలా అక్కడికి వెళ్లి, అక్కడ ఉన్న సమస్యలని ఎలా పరిష్కరించాడు? అసలు నరేష్ చెప్పింది నిజమా అబద్దమా అనేదే మిగిలిన కథ.

భీష్మ విషయంలో పెర్ఫార్మన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. తెరపై కనిపించిన ప్రతి యాక్టర్ అదరగొట్టేసారు. ఒకరికి మించి ఒకరు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక డీటైల్ గా చూస్తే.. నితిన్ సింపుల్ అండ్ లవర్ బాయ్ లుక్ లో కనిపించి నటనతో ఆధ్యంతం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసాడు. ముఖ్యంగా వెన్నల కిషోర్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, నరేష్ లతో కాంబినేషన్ సీన్స్ లో కామెడీ టైమింగ్ అదిరింది. ఇక రష్మిక మందన్న కూడా బబ్లీ బబ్లీ పాత్రలో సూపర్బ్ గా చేసింది. నితిన్ – రష్మిక పెయిర్ కూడా ఆన్ స్క్రీన్ వాటే వాటే బ్యూటీ అనేలా ఉంది.

వెన్నెల కిషోర్ ట్రాక్ మనల్ని మరోసారి కడుపుబ్బా నవ్విస్తుంది. సంపత్ రాజ్, నరేష్, బ్రహ్మాజీల బెస్ట్ పెర్ఫార్మన్స్ తో వీరి ట్రాక్స్ కూడా సూపర్బ్ గా పేలాయి. మెయిన్ గా ప్రీ ఇంటర్వల్ దగ్గర వచ్చే 30 నిమిషాలు భీభత్సంగా నవ్విస్తుంది. అలాగే సెకండాఫ్ లోని మొదటి 40 నిమిషాలు ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేస్తారు. నెగటివ్ షేడ్స్ లో జిష్హు షేన్ గుప్తా మరోసారి మెప్పించాడు. అలాగే సీనియర్ యాక్టర్ అనంత్ నాగ్ కీలక పాత్రలో అందరినీ మెప్పించాడు.

భీష్మకి అన్ని డిపార్ట్మెంట్స్ సూపర్బ్ అవుట్ ఫుట్ ఇవ్వడం వలనే థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సాయి శ్రీరామ్ విజువల్స్ నయనానందకరంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా క్లాస్ గా, ప్రతి యాక్టర్ ని ఎంతో అందంగా చూపించడం వలన కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాయి. సాగర్ స్వర మహతి అందించిన సింగల్, వాటే బ్యూటీ సాంగ్స్ విజువల్ గా కూడా సూపర్బ్, మిగతావి జస్ట్ ఓకే.. కానీ నేపధ్య సంగీతంలో మాత్రం ది బెస్ట్ ఇచ్చి సినిమాని మరో లెవల్ లో కూర్చో బెట్టాడు. నవీన్ నూలి ఎడిటింగ్ చాలా స్పీడ్ గా, క్లైమాక్స్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంది. వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చాలా బాగుంది. స్పెషల్లీ సెకండాఫ్ లో పొలంలో వచ్చే ఫైట్ లో నితిన్ కి ఇచ్చిన ఎలివేషన్స్ సూపర్బ్. వాటే బ్యూటీ సాంగ్ లో జానీ మాస్టర్ స్టెప్స్ అదుర్స్.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన వెంకీ కుడుముల విషయానికి వస్తే.. తన మొదటి సినిమాలానే ఇందులో కూడా తను స్ట్రాంగ్ అయిన కామెడీ అనే బ్రహ్మాస్త్రంతో అందరినీ మెప్పించాడు. రైటర్ తానే కావడం వలన స్టోరీ లైన్ చాలా చిన్నదైనప్పటికీ ట్రీట్మెంట్, కామెడీ అండ్ టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పించేసాడు. తాను రాసుకున్న సీన్స్, కామెడీ అన్నీ వర్కౌట్ అయ్యాయి కానీ ఎప్పటిలానే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి తేల్చేసాడు. కథలో హీరో – విలన్ కి గట్టి పోటా పోటీ సీన్స్ పెట్టే ఆస్కారం ఉన్నప్పటికీ సరిగా వాడుకోలేదు. చాలా సింపుల్ గా ఫినిష్ చేసేసాడు. కథ పరంగా చాలా సింపుల్ అయినప్పటికీ తన మార్క్ కామెడీ, లవ్ సీన్స్, టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పించి చాలా మంది దాటలేని ద్వితీయ విజ్ఞాన్ని విజయవంతంగా దాటేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పెట్టిన ప్రతి రూపాయి తెరపై అందంగా కనిపించి, ఆహ్లాదాన్ని పంచిందని చెప్పాలి.

చాలా రోజుల నుంచి ఓ మంచి సినిమా కోసం చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి మస్త్ ఎంటర్టైనర్ దొరికింది, అలాగే సినిమాలేవీ లేకపోయావడం వలన ఫుల్ థియేటర్స్ దొరికాయి, అన్నిటికీ మించి సూపర్ హిట్ మౌత్ టాక్ వస్తుండడంతో ‘భీష్మ’ సినిమా నితిన్ కెరీర్లో మరో బెస్ట్ హిట్ గా నిలిచే సినిమా అవుతుంది.

తెలుగు బుల్లెట్ రేటింగ్ : 3.5/5