Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉంటరంటారు. ఒకప్పుడు ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా మోడీతో గట్టిగా తలపడ్డ బీహార్ సీఎం నితీష్… ఇప్పుడు పాత మిత్రుడికి చేరువౌతున్నట్లే కనిపిస్తోంది. అనుంగు మిత్రుడు, తనకు సీనియర్ అయిన లాలూపై అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో… ఆయనతో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్తే పుట్టి మునుగుతుందని నితీష్ భావిస్తున్నారు. అసలు లాలూతో నితీష్ ఎప్పట్నుంచో బలవంతపు సంసారం చేస్తున్నారు.
కానీ బీహార్ గవర్నర్ గా రామ్ నాథ్ కోవింద్ వచ్చాక లెక్కలు మారిపోయాయి. ఆయన నితీష్, మోడీ మధ్య ప్రభావవంతంగా మధ్యవర్తిత్వం చేసి… రాజీ కుదిర్చినట్లే కనిపిస్తోంది. అందుకే కోవింద్ పట్నా వెళ్లినప్పట్నుంచీ నితీష్ కు మోడీ విధానాలు మంచివైపోయాయి. నోట్లరద్దుకు బహిరంగంగా మద్దతు పలికిన విపక్ష సీఎం నితీష్ ఒక్కరే. అందుకే తనకు, కేంద్రానికి రాజీ కుదిర్చిన కోవింద్ నే రాష్ట్రపతిగా ఎంపిక చేయడంతో… నితీష్ మొహమాటానికి పోయి… మైత్రికి అంగీకరించారనేది విపక్షాల అభిప్రాయం.
కానీ అసలు విషయం వేరే ఉంది. బీహార్ ఎన్నికలు ఈసారి అంత వీజీ కాదు. ప్రస్తుతం నితీష్ కూటమిలో కాంగ్రెస్, లాలూ ఉన్నారు. కాంగ్రెస్ మునిగిపోయిన పడవ. లాలూ సంగతి సరేసరి. కావల్సినన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరితో ఎన్నికలకు వెళ్తే మట్టే మిగులుతుందని జేడీయూ సీనియర్లు నితీష్ కు చెప్పారట. అందుకే పరిస్థితి గ్రహించిన నితీష్… ఎప్పటిలాగే పాత నేస్తం ఎన్డీఏకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.