తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా నిరుపేదలకు రెక్కాడితే కానీ.. డొక్కాడని పరిస్థితి. ఇలాంటి సమయంలో యువకులు ఎంత చదువు చదువుకున్నా.. ఉద్యోగాలకు వెళ్లే సమయంలో కరోనా మహమ్మారి ఆటంకం ఏర్పరచింది. దీంతో చేసేదిలేక తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని భావించి ఇసుక క్వారీలో పనికి కుదిరారు ఆయువకులు. అక్కడ కూడా వర్షాలు పడటంతో బాగా ఇబ్బంది ఏర్పడింది. దీంతో పనుల్లేక ఇంటికి బయల్దేరిన ముగ్గురు బాల్యమిత్రులను అకాల మృత్యువు అమాంతం మింగేసింది. లారీ రూపంలో దూసుకొచ్చి మృత్యువు ముగ్గురు మిత్రులను బలితీసుకుంది. కాగా ఈ అత్యంత విషాద ఘటనలో జూలపల్లి మండలం అబ్బాపూర్‌కి చెందిన రజనీకాంత్, మిట్ట మధుకర్, అదే మండలంలోని బాలరాజుపల్లికి చెందిన సురేష్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. చిన్నప్పటి నుంచి ఈ ముగ్గురూ స్నేహితులు. కలిసే చదువుకున్నారు. రజనీకాంత్, సురేష్ డిగ్రీ పూర్తి చేశారు. మధుకర్ ఎంబీఏ చదివాడు. ఉద్యోగాల కోసం రెడీ అవుతోన్న సమయంలో కరోనా మహమ్మారి కారణంగా ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఖాళీగా ఉండలేక కూలీ పనులకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే ఆ ముగ్గురివీ పేద కుటుంబాలే కావడంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్ ఇసుక క్వారీలో సూపర్‌వైజర్లుగా పనికి కుదిరారు. అక్కడే ఉంటూ పనిచేసుకుంటూ ఉండగా వర్షం ఆటంకంగా మారింది. ఈమధ్యనే కురిసిన వర్షాలకు క్వారీలో పని ఆగిపోవడంతో ముగ్గురూ బైక్‌పై ఇళ్లకు బయల్దేరారు.