Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాములుగా అయితే 2019 మార్చి తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి వుంది. అప్పుడే లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎలక్షన్స్ నిర్వహించాల్సిన జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నగారా ఎప్పుడు మోగితే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల గంట కూడా మోగినట్టే. ఆ ఎన్నికలు మాములుగా జరగాల్సిన దాని కన్నా ముందే జరుగుతున్నాయని ఓ రెండు నెలల ముందు దాకా వినిపించిన మాట. ఇందుకోసం అటు మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎదురు చూస్తున్నట్టు గట్టిగా వినిపించిన మాట. ఇక నంద్యాల ఎన్నికల ఫలితం వచ్చే దాకా ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్ పెద్ద కలలే కన్నారు. కానీ ఈ రెండు నెలల్లో మరీ ముఖ్యంగా ఈ నెల వ్యవధిలో ముందస్తు ఎన్నికల మాట వెనక్కి వెళ్ళిపోయింది.
నిన్నమొన్నటిదాకా ఎన్నికల కోసం తహతహలాడిన ఎన్నో పక్షాలు ఇప్పుడు ఆ మాట ఎత్తితేనే ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఇబ్బంది అందరికన్నా బీజేపీ కి ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పన్ను విధానంతో దేశ ఆర్ధిక వ్యవస్థలో గొప్ప మార్పులు వస్తాయని బీజేపీ ప్రకటించింది. మోడీ మీద నమ్మకంతో ఏడాదికి పైగా ఎదురు చూసిన వారికి నిరాశ మినహా దక్కిందేమీ లేదు. ఇక జీఎస్టీ గురించి చెప్పాల్సిన పనిలేదు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వస్త్ర వ్యాపారులు పెద్ద ఎత్తున బీజేపీ కి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరడం దీని చలవే. ఈ పరిస్థితులు మోడీకి కూడా అర్ధం అవుతున్నాయి. అందుకే ఆయన ఎన్నికల విషయం పక్కనబెట్టి ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా ఏమి చేయాలో ఆలోచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు చంద్రులు కూడా అధికార పక్షం మీద ప్రజల్లో పైకి కనిపిస్తున్నంత సానుకూలత లేదని గ్రహించారు. ఆంధ్రాలో రాజకీయ సమీకరణాలు కూడా ఇంకా అర్ధం కాకుండా వున్నాయి. బీజేపీ ఇటు టీడీపీ అటు వైసీపీ తో ఏకకాలంలో పయనిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ నేతృత్వంలోని జనసేన కూడా తమ రాజకీయ పంధా ఏమిటో ఇంకా స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఈ పరిణామాలు చంద్రబాబు దూకుడుకి స్పీడ్ బ్రేకుల్లా పనిచేస్తున్నాయి. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ కాస్త దూకుడు పెంచడం, అన్ని రాజకీయ పక్షాలు తనకు వ్యతిరేకంగా ఒక్కటి కావడం చూస్తున్న కెసిఆర్ కూడా ఈ వేడి చల్లారే దాకా ఎన్నికల ప్రస్తావన రాకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు. ఇక ఏపీ లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత ఎన్నికలు అంటేనే భయపడిపోతున్నారు. పార్టీల పరిస్థితి ఇలా వుంది కాబట్టే ముందస్తు మాట వెనక్కి వెళ్ళిపోయింది.