Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇచ్చిన హామీలు అన్నిటినీ తుంగలో తొక్కిన బీజేపీ సర్కార్ అంటే ఆంధ్రులు మండిపడిపోతున్నారు. ఈ విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. అందుకే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి పర్లేదు అనుకునే కాకినాడలోనే మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో 9 స్థానాలు ఇస్తే ఆ పార్టీ చచ్చి చెడి ఒక స్థానాల్లో గెలిచింది. అక్కడ ఓటమితో అయినా బుద్ధి తెచ్చుకుంటుందా బీజేపీ అంటే అదీ లేదు. అక్కడ ఓటమికి సోము వీర్రాజు ఇన్నాళ్ళకి ఓ కొత్త కారణం కనిపెట్టారు.
బీజేపీ పోటీ చేసిన స్థానాల్లోటీడీపీ రెబెల్స్ ని చంద్రబాబే పోటీ చేయించడం వల్లే ఓటమి ఎదురు అయ్యిందట. ఓ పక్క మాకు సొంత బలం అంతుంది , ఇంతుంది అని చెప్పుకుంటూనే ఈ కుంటిసాకులతో కలలు, భ్రమల్లో బతకడం సోము లాంటి వాళ్లకి అలవాటు అయిపోయింది పాపం. పైగా ఇన్నాళ్లుగా పొత్తు రాజకీయాల వల్లే ఏపీ లో బీజేపీ ఎదగలేకపోయిందని కూడా వీర్రాజు అంటున్నారు. అదే నిజం అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీ చేస్తే ఆ పార్టీకి ఎంత బలం ఉందో తెలిసివస్తుంది. సోము వీర్రాజు కూడా ఎక్కడైనా మున్సిపల్ లేదా పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డ్ మెంబర్ గా బీజేపీ జెండా తో ప్రచారం చేసి గెలిచి వస్తే ఇప్పుడు చెప్పే మాటలకు కూడా ఓ విలువ ఉంటుంది.
సోము లాంటి వాళ్ళ మాటలు విని కేంద్రంలో బీజేపీ పెద్దలు కొందరు ఏపీ లో ఆ పార్టీ బలాన్ని ఎక్కువగా వూహించుకుంటున్నారు. సోము కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న 4 స్థానాలు నిలబెట్టుకోమని ఆదేశాలు ఇస్తే చాలు ఆయన గారి బలం , బీజేపీ బలగం సత్తా ఏమిటో ఢిల్లీ పెద్దలకు పూస గుచ్చినట్టు అర్ధం అవుతుంది. వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోకుండా మాటలు కోటలు దాటించడం వల్ల ప్రయోజనం సున్నా. ఈ విషయం సోము లాంటి ఉత్తర కుమారులకు , ఢిల్లీలో కూర్చున్న దృతరాష్ట్రులకు తొందర్లోనే అర్ధం అవుతుంది.