Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఈ మధ్య బీజేపీ నేతలకు బాగా అలవాటు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అయ్యా బాబు అని అడిగినంత కాలం కేంద్రంలో పెద్దలే జనంలో ఒక్క ఓటు కూడా చోటామోటా బీజేపీ నేతలు కూడా రెచ్చిపోయారు. బాబుని ఇబ్బంది పెట్టడానికి చేయాల్సిన పనులన్నీ చేశారు. పోలవరం అంశంలో కూడా అలాగే చేశారు. చివరకు పోలవరం మీద బాబు గట్టిగా మాట్లాడేసరికి జనాల్లో వస్తున్న కోపం చూసి బీజేపీ నేతలు ప్లేట్ ఫిరాయించారు.
ఏపీ లో ఐదు లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు పోలవరం ఎపిసోడ్ ని కేంద్రజలవనరుల శాఖ అధికారుల మీదకు తోసేస్తూ గుమాస్తాలు మాటలు పట్టించుకుంటారా అని ఆంధ్రులను, చంద్రబాబుని కూల్ చేసే పని మొదలెట్టారు. ఓ జాతీయ సంస్థ కి నాయకత్వం వహిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ని గుమస్తాగా జమకట్టడంతోనే బీజేపీ నాయకులకు అధికారం ఏ స్థాయిలో తలకు ఎక్కిందో అర్ధం అవుతూనే వుంది.
ఆ అధికారి ఇలా వ్యవహరిస్తున్నాడని ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. చివరకు కేంద్రమంత్రి ఉమా భారతి ముందే చంద్రబాబుని ఆ అధికారి తక్కువ చేసి మాట్లాడిన రోజున చంకలు గుద్దుకుని సంతోషపడ్డ బీజేపీ నేతలు తీరా ఇప్పుడు ఆంధ్రుల కోపం చూసి ఆయన్ని గుమస్తా అంటే చేసిన తప్పులు మాసిపోతాయా? నిజమే మురళీధరరావు అన్నట్టు పోలవరం పనులు ఆపమన్న కేంద్ర జలవనరుల శాఖ అధికారులు గుమాస్తాలు కాబట్టి వారి మాటలు పట్టించుకోము. సరే ..అదే స్థాయి అధికారులు కదా నీతి ఆయోగ్ లో పని చేసేది. మరి వారు చెప్పిన మాటలను అడ్డం పెట్టుకుని ఏపీ కి ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టారు? అధికారం వుంది కదాని నోటికి వచ్చినట్టు, అవసరానికి తగ్గట్టు మాట్లాడితే మాట్లాడితే చూస్తూ ఊరుకోడానికి జనం పిచ్చి వాళ్ళు కాదు.