రెండు, మూడు రోజుల కిందట వరకూ పూర్తి స్థాయిలో చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేసిన పవన్ ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేశారు. జగన్ ను ఆయన మగతనం దగ్గర్నుంచి చాలా చాలా మాట్లాడుతున్నారు. ఈ విమర్శలకు కారణం తనను పెళ్ళిళ్ళ విషయంలో వ్యక్తిగతంగా విమర్శించడం. అనేది పవన్ బాధ చూసిన ఎవరికీ అయినా అర్ధం అవుతుంది. వైకాపా ఎమెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం కొత్త ఏమి కాదు అయినా పవన్ కల్యాణ్.. కొత్తగా వాటిని గుర్తు తెచ్చుకుని విమర్శలు చేస్తున్నారు. వీటికి తోడు కొత్తగా ఏకంగా ముస్లింలతో జరిగిన సమావేశంలోనే బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. బీజేపీతో స్నేహం ఏమిటని ప్రశ్నించిన వారికి బీజేపీ మీరనుకుంటున్న టైప్ పార్టీ కాదంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ అంటే దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువుల్ని ముస్లింలపై రెచ్చగొట్టి దేశ ప్రజల మధ్య విభజన తెచ్చి అధికారాన్ని దండుకోవాలని ప్రయత్నించే ఓ మతతత్వ పార్టీ అనే సంగతి ప్రపంచంలో అందరికీ తెలుసు. గుజరాత్‌లో గోద్రా అనే మారణకాండను చూసిన తర్వాత దాన్ని కర్త, కర్మ, క్రియ లాంటి వ్యక్తి ప్రధానిగా మారిన తర్వాత అందులో ఎవరికీ అనుమానాల్లేవు. బీజేపీ నేతలు కూడా అసలు ముస్లింలు ఇండియన్స్ కాదన్నట్లు ప్రకటనలు చేస్తూ చెలరేగిపోతూంటారు.
అయినా వాళ్లు కూడా తమ పార్టీ మతతత్వ పార్టీ కాదని చెప్పుకోరు. తమది హిందూత్వ పార్టీ అనే చెప్పుకుంటారు. కానీ ఆ బీజేపీని అడ్డంగా సమర్థించేందుకు ఆ పార్టీ నేతల కన్నా ఇతర పార్టీ అధినేత బాగా ముందుకు వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఓ రాజకీయ పార్టీ మాత్రమేనని మతతత్వ పార్టీ కాదని పవన్ కల్యాణ్ నేరుగా బీజేపీకి సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయితే ప్రత్యేకంగా కొంత మంది ముస్లింలను పిలిపించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ముస్లింలులు ఆశ్చర్యపోయారు. ఈ దెబ్బకి ఏపీ రాజకీయ వర్గాలు మరింతగా ఆశ్చర్యపోయాయి. నిన్నామొన్నటి వరకూ మోదీ , అమిత్ షాలు తన బాబాయ్‌లేమీ కాదన్నట్లు ప్రకటనలు చేసి ఇప్పుడు ఇలా ఒక్క సారిగా మా బీజేపీ బంగారం అన్నట్లు మాట్లాడటానికి కారణం ఏమిటని జనసేన ద్వితీయశ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు.
నిజానికి భారతీయ జనతా పార్టీని అత్యంత తీవ్రంగా విమర్శించిన వారిలో పవన్ కల్యాణ్ ఒకరు. బీఫ్ పాలిటిక్స్, ఉత్తరాది పార్టీ అని విమర్శించారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రజలంతా బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో ఆ పార్టీని వెనుకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు వింటుంటే పవన్ కల్యాణ్ పూర్తిగా బీజేపీ ట్రాప్ లో పడిపోయాడని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.