ఓ వైపు వివాదం… మ‌రో వైపు మ‌ద్ద‌తు

BJP leader suraj pal comments on Deepika Padukone Padmavati Director

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌ద్మావ‌తిపై వివాదం అంత‌కంత‌కూ పెరుగుతోంది. సినిమా విడుద‌ల వాయిదాప‌డిన‌ప్ప‌టికీ రాజ్ పుత్ కర్ణిసేన శాంతించ‌డం లేదు. ప‌ద్మావ‌తికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు కొన‌సాగిస్తోంది. కొన్ని రాష్ట్రాల బీజేపీ నేత‌లు క‌ర్ణిసేన‌కు మ‌ద్ద‌తివ్వ‌డంపై దేశ‌వ్యాప్తంగా ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ప‌ద్మావ‌తిని వ్య‌తిరేకిస్తున్న‌వారికి దీటుగా మ‌ద్ద‌తిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఈ సినిమాపై కొన‌సాగుతున్న వివాదం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప‌శ్చిమ బంగ ముఖ్య‌మంత్రి మమ‌తాబెన‌ర్జీ వ్యాఖ్యానించారు. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను నాశ‌నం చేసేందుకు ఓ రాజ‌కీయ పార్టీ కంక‌ణం క‌ట్టుకోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఇలాంటి హింసాత్మ‌క శ‌క్తుల‌పై పోరాడేందుకు చిత్ర‌ప‌రిశ్ర‌మ మొత్తం క‌లిసి క‌ట్టుగా నిల‌బ‌డాల‌ని ఆమె సూచించారు.

kamal-hassan-and-mamata-ban

విశ్వ‌న‌టుడు క‌మల్ హాస‌న్ ప‌ద్మావ‌తికి మ‌ద్ద‌తు ప‌లికారు. సినిమా ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ, హీరోయిన్ దీపికా ప‌దుకునే త‌ల‌లు తెస్తే రూ. 10 కోట్లు న‌జ‌రానా ఇస్తాన‌ని బీజేపీ నేత సూర‌జ్ పాల్ ప్ర‌క‌టించ‌డంపై క‌మ‌ల్ మండిప‌డ్డారు. దీపిక త‌ల న‌రికితే ఆ త‌ల‌ను త‌న వ‌ద్దే భ‌ద్రంగా దాచుకుంటాన‌న్నారు. ఆమె శరీరాకృతి కంటే శిర‌స్సునే ఎక్కువ గౌర‌విస్తాన‌ని క‌మ‌ల్ వ్యాఖ్యానించారు. ఒక‌ప్పుడు చాలా సంఘాలు త‌న సినిమాల‌ను కూడా వ్య‌తిరేకించాయ‌ని క‌మ‌ల్ గుర్తుచేసుకున్నారు. మాట‌లు చాల‌ని, ఇది ఆలోచించాల్సిన స‌మ‌య‌మ‌ని ట్వీట్ చేశారు. అయితే ప‌ద్మావ‌తికి కొన్ని రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, అనేక‌మంది న‌టీన‌టులు అండ‌గా నిలుస్తున్న‌ప్ప‌టికీ బాలీవుడ్ నుంచి మాత్రం మ‌ద్ద‌తు క‌రువ‌యింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

twinkle-Khanna-comments-on-

బాలీవుడ్ న‌టులెవ‌రూ ప‌ద్మావ‌తికి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ భార్య‌, మాజీ న‌టి ట్వింకిల్ ఖ‌న్నా స్పందించారు. దేశం తెలుసుకోవాల‌నుకుంటోంది అంటూ ఆమె సూర‌జ్ పాల్ కు ఓ ప్ర‌శ్న వేశారు. భ‌న్సాలీ, దీపిక త‌ల‌ల‌కు ప్ర‌క‌టించిన రూ. 10కోట్ల న‌జ‌రానాలో జీఎస్టీని క‌లిపారా లేక మిన‌హాయించి ప్ర‌క‌టించారా అని వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు. వివాదాలన్నింటినీ దాటుకుని ప‌ద్మావ‌తి కనీవినీ ఎరుగ‌ని విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

shahid kapoor on padmavati movie

అటు ప‌ద్మావ‌తి వివాదంపై సినిమాలో మ‌హారావ‌ల్ ర‌త‌న్ సింగ్ గా న‌టించిన షాహిద్ క‌పూర్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ప‌ద్మావ‌తి క‌థ నేప‌థ్యాన్ని బ‌ట్టి కొన్నిసార్లు స‌మ‌స్య రావొచ్చ‌ని, తాను మాత్రం ఆశావ‌హ దృక్ప‌థంతో ఉంటాన‌ని, ఆవేశ‌ప‌డేందుకు ఇది స‌మ‌యం కాద‌ని షాహిద్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌క్రియ‌పై న‌మ్మ‌కం ఉంద‌ని, ఈ చిత్రం క‌చ్చితంగా విడుద‌ల‌వుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తంచేశారు. ఇది అంద‌రూ గ‌ర్వ‌ప‌డే సినిమా అని, ఒక‌సారి సినిమా చూస్తే ప్రేక్ష‌కులు ఇప్పుడు జ‌రుగుతున్న వివాదాన్ని మ‌ర్చిపోతార‌ని తెలిపారు. హింస‌కు దారితీసే చ‌ర్చ ఏదీ మంచిదికాద‌ని, ఏ వ‌ర్గంపైనా తాను వ్యాఖ్య‌లు చేయ‌ద‌ల్చుకోలేద‌ని, సినిమా విడుద‌ల చేస్తే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని కొంద‌రు హెచ్చ‌రించ‌డం సిగ్గుచేట‌ని షాహిద్ అన్నారు.

Suraj-Pal-Amu-comments-on-P

అటు భ‌న్సాలీ, దీపిక త‌ల‌ల‌కు వెల ప్ర‌క‌టించిన బీజేపీ నేత సూర‌జ్ పాల్ అముకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. సూర‌జ్ పాల్ వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని, పార్టీతో వాటికి ఎటువంటి సంబంధం లేద‌ని బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ జైన్ ప్ర‌క‌టించారు. అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ లోని బీజేపీ ప్ర‌భుత్వాలు పద్మావ‌తిపై నిషేధం విధించాయి. సుప్రీంకోర్టు మాత్రం ప‌ద్మావ‌తికి మ‌ద్ద‌తు తెలిపింది. సినిమా సెన్సార్ బోర్డుకు వెళ్ల‌క‌ముందే విమ‌ర్శించ‌డం స‌బ‌బు కాద‌ని సూచించింది. అటు ప‌ద్మావ‌తిపై వివాదాలు ఎంత‌గా పెరుగుతున్నాయో అంత‌గా ప్రేక్ష‌కుల‌కు ఆ సినిమాపై ఆస‌క్తి పెరుగుతోంది. సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు.