Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పై ఇటీవల వరుస వివాదాలు చెలరేగుతున్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ విడుదల చేసిన టూరిజం బుక్ లెట్ లో తాజ్ మహల్ పేరు ప్రచురించకపోవడంపై వివాదం చెలరేగింది. యూపీలో బీజేపీ ఆరు నెలల పాలన ముగిసిన సందర్భంగా పర్యాటక ప్రాంతాలతో ఓ బుక్ లెట్ విడుదల చేశారు. అయితే యూపీ ప్రభుత్వం ఇందులో తాజ్ మహల్ పేరు చేర్చలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తంకావడంతో రాష్ట్ర మంత్రి సిద్దార్థ్ నాథ్ స్పందించారు. సమాచార లోపం వల్లే ఈ తప్పిదం జరిగిందని అన్నారు. రాష్ట్ర పర్యాటక మంత్రి రీటా బహుగుణ జోషి కూడా దీనిపై వివరణ ఇచ్చారు. తాజ్ మహల్ చారిత్రక వారసత్వ సంపద అని, ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో స్థానం సంపాదించిన గొప్ట కట్టడమని కొనియాడారు. తప్పిదంపై వివరణతో ఈ గొడవ సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ తాజాగా యూపీ బీజేపీ నేత ఒకరు తాజ్ మహల్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత సంస్కృతికి తాజ్ మహల్ ఓ మాయని మచ్చలాంటిదని యూపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని చారిత్రక కట్టడాల జాబితా నుంచి తాజ్ మహల్ ను తొలగించడంపై చాలా మంది విచారం వ్యక్తంచేస్తున్నారని సంగీత్ సోమ్ చెప్పారు. అయితే ఏ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నామని ఆయన ప్రశ్నించారు. తాజ్ మహల్ ను నిర్మించిన వ్యక్తిని కొడుకు జైల్లో పెట్టాడని, హిందువులనే లేకుండా చేయాలనుకున్నాడని సంగీత్ సోమ్ చరిత్రలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నంచేశారు. అలాంటి చరిత్రను తాము మారుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బుక్ లెట్ లో తాజమహల్ పేరులేకపోవడం, సంగీత్ సోమ్ వ్యాఖ్యలు గమనిస్తే… ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్న ఘటనలు కాదని, యూపీలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే ఈ వివాదం రేకిత్తిస్తోందని అర్ధమవుతోంది. నిజానికి తాజ్ మహల్ ఎవరు కట్టారనేదానిపై అనేక వివాదాలున్నాయి.
పాఠ్య పుస్తకాల్లోనూ, ముస్లిం చరిత్రకారులు రాసిన పుస్తకాల్లోనూ తాజ్ మహల్ ను తన భార్య పై ప్రేమకు గుర్తుగా షాజహాన్ నిర్మించాడని రాసి ఉన్నప్పటికీ… అసలు ఆయన పరిపాలనా కాలంలో ఆ కట్టడం నిర్మితమయినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని కొందరు వాదిస్తున్నారు. ముస్లిం పాలకులు భారతదేశంపై దండెత్తకముందు దేశాన్ని పాలించిన హిందూ చక్రవర్తులు ఎంతో వ్యయప్రయాసల కోర్చి ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారని, అదో శైవక్షేత్రమని ఓ వాదన ప్రచారంలో ఉంది. గతంలో హిందూ చక్రవర్తులు కట్టిన అనేక కట్టడాలను కూల్చివేసో లేక, తమకు తగ్గట్టుగానో మలుచుకుని పాత గుర్తులను చెరిపివేసిన మొఘల్ చక్రవర్తులు తాజ్ మహల్ ను సైతం అలానే మార్చివేశారని, అయితే చరిత్రను నమోదుచేసిన వారంతా ముస్లిం చరిత్రకారులు కావడంతో ఆ కట్టడాన్ని మొఘల్ చక్రవర్తులే నిర్మించినట్టు ప్రచారంలోకి తెచ్చారని దేశ ప్రజల్లో అనేకమంది నమ్ముతున్నారు. ఆధునిక చరిత్రకారులు కొంతమంది ఈ విషయాన్ని తమ పుస్తకాల్లో పొందుపరిచారు కూడా. ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని తాజ్ మహల్ అసలు కథేంటో తేల్చాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అందుకోసమే తాజ్ మహల్ పేరును కావాలనే పర్యాటక ప్రాంతాల బుక్ లెట్ లో చేర్చలేదని భావిస్తున్నారు. అదే నిజమయితే…రానున్న రోజుల్లో దేశరాజకీయాల్లో ఈ విషయం పెను ప్రకంపనలు సృష్టించే అవకాశముంది. ఇది మరో రామజన్మభూమి వివాదంగా మారే ప్రమాదమూ పొంచి ఉంది.