బీజేపీతో జగన్ స్నేహాన్ని బట్టబయలు చేసిన విష్ణుకుమార్ రాజు

BJP MLA Vishnu Kumar Raju

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు మొదటి నుండి ఈయనది విలక్షణ శైలే. టీడీపీ-బీజేపీ బంధం బలంగా ఉన్న రోజుల్లో సిఎం చంద్రబాబు పాలన తీరును ప్రతి రొజూ అభినందించేవారు. అసలు చంద్రబాబు లాంటి నేత ఉంటే ఏపీ అభివృద్ధి అందనంత స్థాయికి ఎదుగుతుందని ప్రశంసలు కురిపిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు కావడం వల్ల ఆరెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనేంత వైరం పెరిగింది. మోడీ పేరు చెబితే టీడీపీ నేతలు, చంద్రబాబు పేరు చెబితేనే బీజేపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోక ముందే టీడీపీ మీద కొద్దిరోజులుగా విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో కటీఫ్ అయిన తర్వాత టీడీపీ ఏపీ సీఎం చంద్రబాబులపై ఆ విమర్శల స్పీడ్ ను పెంచారు. తాజాగా మరోసారి చంద్రబాబు ప్రభుత్వం మీదా జగన్ మీదా షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.  రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ఆయన జోస్యం చెప్పారు. 
ఇప్పటికే చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని భవిష్యత్తులో అది పూర్తిగా పడిపోతుందని ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాదులో ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే విజయవాడకు హుటాహుటిన మకాం మార్చారని అన్నారు. మొన్నటివరకు బీజేపీని పొగిడిన నోటితోనే…..ఇపుడు విమర్శలు గుప్పిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. కర్ణాటకలోని తెలుగువారికి …..బీజేపీకి ఓటు వేయవద్దని పిలుపునిస్తున్నారని నిప్పులు చెరిగారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ బండారాన్ని త్వరలోనే బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు కూడా విషు రాజు మీద విరుచుకుపడుతున్నారు. నిన్నమొన్నటి దాకా బాబు పాల భేష్, ఇలాంటి నేత ఏపీ కి దొరకడం మన అదృష్టం అన్న ఆయన ఈరోజు పార్టీలు విడిపోగానే ఎలా ప్లేటు ఫిరాయించి మాట్లాడుతున్నాడో గమనించాలని అంటున్నారు. నిజమే ఒక రకంగా చూస్తే మొదటి నుండి విష్ణు రాజు తెలుగుదేశం తో ఉన్నా ఆయన మనసంతా జగన్ వైపే ఉండేది ఈ విషయం ఆయనే ఒక సారి ప్రస్తావించారు కూడా తనకి జగన్ అంటే ఇష్టం అని. ఇప్పుడు ఈ విధమయిన దిగజారుడు వ్యాఖ్యలు చూస్తోంటే ఆయన నిజంగానే వైసీపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడా అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదు. 
గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఈ సారి అలాంటి కూటమి లేదు కాబట్టి వైకాపా గెలుపు ఖాయమని విష్ణు కుమార్ రాజు వాదిస్తున్నారు. అసలు తమ తమ పార్టీల మీద నమ్మకం లేని వారే వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటారే అలాంటిది తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పకుండా జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ నేత చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చలకి దారి తీస్తోంది. ఇప్పటికే హీరో శివాజీ వంటి వారు ఆపరేషన్ గరుడ అని ఒక ప్లాన్ బయట పెట్టగా ఇప్పుడు ఈ విష్ణు రాజు వంటి వారు శివాజీ మాటలని బలపరుస్తున్నారు. బీజేపీ-వైసీపీ మధ్య లోపాయికారీగా ఏదో ఉంది అనే అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి.