విశ్వాన్ని వణికిస్తోన్న ఏకైక వైరస్ కరోనా.. ఇప్పుడిది ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దేశంలో లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. అయినప్పటికీ.. కొందరు నిబంధనలను అతిక్రమిస్తూనే ఉన్నారు. పని ఉన్నా లేకున్నా అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతూ… నానా యాగా సృష్టిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం నొక్కి చెప్తున్నప్పటికీ… ప్రజలు పెడచెవిన పెడుతున్నారు.
కాగా ఇప్పటికే… లాక్డౌన్ కాలంలో ప్రజలు సమూహంగా ఏర్పడి వివాహాలు, వేడుకలు, వినోదాలు జరుపుకోవద్దని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. సాధారణ ప్రజలతోపాటు ఈ లిస్ట్ లో రాజకీయ నాయకులు కూడా చేరిపోయారు. తాజాగా కర్ణాటకలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే తన పుట్టినరోజును అనేకమంది గ్రామస్తుల మధ్యలో జరుపుకోవడం సంచలనంగా మారింది.
అదేమంటే… తుమకూరు జిల్లా తురువెకెరె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం జయరామ్ గుబ్బి ప్రాంతంలో పుట్టిన రోజును నిర్వహించుకున్నారు. స్థానికుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలో కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కగిలిస్తుంది. వీరిలో చిన్నారులు కూడా ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం.
అంతేకాకుండా అందరి సమక్షంలో కేక్ కట్ చేసి.. ఆ తర్వాత వారంతా బిర్యానీతో విందును ఏర్పాటు చేశారు. దీంతో కరోనా విస్తరిస్తున్న సమయంలో నిబంధనలు పాటించని బీజేపీ ఎమ్మెల్యే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా కర్ణాటకలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదేం తొలిసారి కాదని గత నెలలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా పెళ్లికి హాజరై విమర్శలు ఎదుర్కొన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.