నిన్న రాత్రి జరిగిన కేంద్ర మంత్రితో టీడీపీ నేతల సమావేశం రసాభాసగా మారింది. రైల్వేజోన్ గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నిన్న సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద ప్రశ్నిస్తున్న టీడీపీ సభ్యుల మాటలకి అడ్డు తగిలి మీరు అబదాలు ఆడుతున్నారంటూ జీవీఎల్ మాట్లాడటం సమావేశంలో కొద్ది సేపు ఉద్రికతకి దారి తీసింది. కేంద్రమంత్రికి సమస్యను మొరపెట్టుకోడానికి వస్తే మధ్యలో కలుగజేసుకోడానికి నువ్వెవరివి అంటూ జీవీఎల్‌పై టీడీపీ నేతలు మండిపడ్డారు. దీంతో అక్కడ చిన్నపాటి యుద్ధవాతావరణం నెలకొంది. ఆ తర్వాత అది రైల్వే మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేసే పరిస్థితి ఎదురయ్యింది.
ఉత్తరాంధ్ర టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా మంగళవారం రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అ
పాయింట్మెంట్ ఇచ్చిన ఆయన దాన్ని తర్వాత సాయంత్రం 6 గంటలకు మార్చారు. ఆ సమయానికి కూడా రాని ఆయన సుమారు రెండున్న గంటల తర్వాత ఎట్టకేలకు రాత్రి 8.20 గంటలకు చేరుకుని టీడీపీ నేతలతో సమావేశమయ్యారు.ఈ సమయంలో కేంద్ర మంత్రితో టీడీపీ నేతలు మాట్లాడుతుండగా ఎంపీ జీవీఎల్ జోక్యం చేసుకుంటూ రైల్వేజోన్‌కు కేంద్రం కూడా సానుకూలంగా ఉందని, వెనుకబడిన జిల్లాల నిధుల వినియోగం సరిగా జరలేదని, అందుకే వాటిని వెనక్కు తీసుకున్నారంటూ పేర్కోవడంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మంత్రి సమాధానం చెప్పాల్సిన సమయంలో మధ్యలో మాట్లాడడానికి జీవీఎల్ ఎవరని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో మంత్రి పీయూష్ గోయెల్ అనూహ్యంగా లేచివెళ్లబోవడంతో ఎంపీ సుజనాచౌదరి సర్ది చెప్పి కూర్చొబెట్టారు. తాను మాట్లాడుతుంటే అడ్డుకోవడం పద్దతిగా లేదని జీవీఎల్ అనడంతో మంత్రి కళా వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో కంభంపాటి హరిబాబు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే టీడీపీ నేతలు దీన్ని అడ్డుకున్నారు. దీంతో వారిరురివురినీ తీసుకుని కేంద్రమంత్రి తన కార్యాలయం లోపలి వెళ్లిపోవడంతో నేతలు మంత్రి కార్యాలయం బయట సుమారు 40 నిమిషాలపాటు ధర్నా చేశారు.