తెలంగాణాలో బీజేపీ బలోపేతమే టార్గెట్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. ఆయన ఈరోజు ఉదయం 10.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు చేరుకుంటారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై నేతలతో ఆయన చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం. సంస్థాగతంగా బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక రోడ్డు మ్యాప్ తయారు చేస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసోం, హరియాణా, త్రిపుర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించారని అందుకే నేటి తెలంగాణా పర్యటన ఉంటుందని చెబుతున్నారు.
అనంతరం బేగంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా ప్రసంగిస్తారు. దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణాన మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు మెజారిటీ లోక్సభ స్థానాలు దక్కించుకునేలా ఆయన కార్యాచరణ చేస్తారు అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీనితో పాటు పార్టీకి ఉపయోగపడే కొందరు పారిశ్రామిక వేత్తలను ఆయన కలవనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా షా పర్యటన కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న అంశాలపైనా ఈ సందర్భంగా చర్చిస్తారని వివరించాయి.